హైదరాబాద్‌లో ఖేలో ఇండియా!
విజయక్రాంతి ఖేల్ విభాగం: హైదరాబాద్ నగరంలో ఖేలో ఇండియా పోటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరిలో జరిగే ఖేలో ఇండియా పోటీలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం ప్రతిపాదన చేసినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని పలు క్రీడా స్టేడియాలను ఖేలో ఇండియా పోటీల కోసం సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం కూడా ఇచ్చిందని వినికిడి. ఇదే కనుక నిజం అయితే వచ్చే ఏడాదిలో మన విశ్వనగరంలో ‘ఖేలో ఇండియా’ పోటీలను చూసే అవకాశం కలగనుంది.
త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీ
తెలంగాణకు త్వరలోనే కొత్త స్పోర్ట్స్ పాలసీని తెచ్చే యోచనలో సర్కారు ఉందట. ఈ కొత్త పాలసీతో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు బాసటగా నిలవాలని ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. మన హైదరాబాద్ నగరంలో ఇకపై జరిగే ప్రాంతీయ క్రీడలకు ఎల్బీ స్టేడియం, జాతీయ క్రీడలకు ఉప్పల్ స్టేడియం, అంతర్జాతీయ క్రీడలకు గచ్చిబౌలి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయని వినికిడి. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణలో హైదరాబాద్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపే యోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందని ప్రచారం జరుగుతోంది. ఇవే కనుక నిజం అయితే రాష్ట్రంలోని క్రీడాకారులకు మంచి రోజులు రానున్నట్లే.




