1 March, 2026 | 4:24 PM

నాగ్‌పూర్ ఫ్యాక్టరీ పేలుడు.. 17 మంది మృతి

01-03-2026 02:30 PM

మహారాష్ట్ర: నాగ్‌పూర్ జిల్లాలోని కటోల్ తహసీల్‌లోని రౌల్‌గావ్‌లో ఉన్న మైనింగ్, పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ సంస్థ ఎస్బీఐ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 17 మంది మరణించగా, 18 మంది తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నాగ్‌పూర్‌లోని ఆసుపత్రులకు చికిత్స కోసం తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలిసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని స్థానికులు తెలిపారు. 

ఈ సంఘటన చాలా దురదృష్టకరమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభివర్ణించారు. తను స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ విషాదం పట్ల ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విచారం వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పీఎంఓ బాధితులకు ఆర్థిక సహాయం కింద పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియా ఇవ్వబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 ఇవ్వబడుతుందని పీఎంఓ  ప్రకటించింది.