01-05-2025 01:49:21 AM
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం తెల్లవారు జామున అపశ్రుతి చోటుచేసుకుంది. సింహా ద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
వీరిలో విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు, శైలజ, ఆమె తల్లి పైలా వెంకటరత్నం, మేనత్త గుజ్జరి మహాలక్ష్మి ఉన్నట్టు నిర్థారించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ. 300 టికెట్ క్యూలైన్‌పై సిమెంట్ గోడ కూలింది.
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలోని సింహాచలం గుడి దగ్గర గోడ కూలిన ఘటనలో భక్తులు మృతి చెందడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సింహాచలం ఆలయ ఘటన బాధాకరమనిమాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
ప్రమాదానికి కారణం అదేనా?
మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఆలయ పరిసరాల్లో రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద ఉన్న గోడ కూలింది. అయితే దీనిని పది రోజుల క్రితమే కొత్తగా నిర్మించారు. గోడ నిర్మాణం చేసేటప్పుడు సరైన ప్రమాణాలు పాటించకపోవడంతోనే ప్రమా దం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
గోడ కూలినప్పుడు ఇటుకలు వేర్వే రుగా పడి ఉండగా వాటి మధ్య సిమెంట్ లేనట్టుగా తెలుస్తోంది. ఇక కూలిన గోడకు దాదాపు మూడు అడుగుల గ్యాప్ ఉండడంతో వర్షానికి మట్టిపెళ్లలు విరిగి గోడ మీద పడడంతో ప్రమాదం జరిగిందనిపిస్తోంది. ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లోగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.