01-05-2025 02:11:33 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్న సందర్భంలో.. ఇప్పటికే ఒకసారి భేటీ అయిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ప్రధా ని మోదీ అధ్యక్షతన బుధవారం కూడా సమావేశమైంది. మొదటి సీసీఎస్ భేటీలో పాక్‌కు షాక్ ఇస్తూ పలు నిర్ణయాలు ప్రకటించారు.
సీసీఎస్ భేటీ అనంతరం రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) భేటీ కూడా జరిగింది. ఈ భేటీలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల గురించి ప్రతిపక్షాల అభ్యర్థనపై చర్చించారు. సీసీ పీఏనే ‘సూపర్ క్యాబినెట్’ అని కూడా అంటారు. సీసీపీఏ సమావేశం చివరిసారిగా 2019లో జరిగింది. అప్పుడు పుల్వామా దాడి అనంతరం ఈ భేటీ జరిగింది.
నాటి ఘటనలో 40 మంది సైనికులు అమరులయ్యారు. ఈ భేటీ తర్వాతే భారత వైమానిక దళం బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఇక ఇప్పుడు కూడా సీసీపీఏ సమావేశం జరిగింది. పహల్గాం ఘటనపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది.
అతికొద్ది మంది కేంద్రమంత్రులు మాత్రమే సూపర్ క్యాబినెట్‌లో ఉంటారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఈ కమిటీకి చైర్మన్‌గా ఉండగా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్‌షా, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ న్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) భేటీ కూడా జరిగింది.
ఆగని పాక్ కాల్పులు..
సరిహద్దుల వెంట పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘన కొనసాగుతూనే ఉంది. వరుసగా ఆరో రోజు కూడా పాక్ సైన్యం కాల్పులకు దిగింది. జమ్మూకశ్మీర్‌లోని పరగ్వాల్ సెక్టార్‌తో పాటు రాజౌరీ జిల్లాలోని సుందర్‌బనీ, నౌషెరా సెక్టార్లలో కూడా పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఎల్‌వోసీతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట కాల్పులు జరిపింది. జమ్మూలోని నాలుగు సెక్టార్లలో పాక్ కాల్పులు జరపగా.. భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టిందని అధికారులు వెల్లడించారు.
నేడో, రేపో భారత ఆర్మీ దాడి!
‘భారత్ తమ దేశం మీద నేడో, రేపో సైనిక చర్య తీసుకుంటుందని.. విశ్వసనీయ సమాచారం అందింది. పాకిస్థాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమే. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా పాక్ ఖండిస్తుంది. ఉగ్రవాదం ఏ రూ పంలో ఉన్నా ప్రమాదకరమే. పహల్గాం దాడి పై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తుకు సహకరిస్తాం అని ఇప్పటికే ప్రకటించాం.
భార త్ ఏవైనా చర్యలకు దిగితే ప్రతి చర్యలు తీవ్రం గా ఉంటాయి.’ అని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా కూడా భారత్ సైనిక చర్య తీసుకుంటుందని వెల్లడించారు.
సరిహద్దుల వద్దకు పాక్ సైన్యం తరలింపు
ఉగ్రదాడి వేళ.. భారత్ దాడి చేస్తుందేమోనని పాకిస్థాన్ తన సైన్యాన్ని సరిహద్దుల వద్ద మోహరిస్తోంది. నావికాదళాన్ని కూడా పాక్ సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారత విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించిన పాక్ తాజాగా.. పీవోకేలోని గిల్గిత్, స్కర్దు మొదలైన ప్రాంతాలకు విమానసర్వీసులను కూడా రద్దు చేసినట్టు స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా పాకిస్థాన్‌లో ఉన్న అన్ని విమానాశ్రయాలకు కూడా హైఅలర్ట్ ప్రకటించినట్టు సమాచారం.
జాతీయ భద్రతా సలహా బోర్డుకు కొత్త చైర్మన్
జాతీయ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్‌గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమిస్తూ కేంద్రం బుధవారం నిర్ణ యం తీసుకుంది. భారత సైన్యంలో విధు లు నిర్వర్తించిన మాజీ అధికారులు ఎయిర్ మార్షల్ పీఎం సిన్హా, లెఫ్టినెంట్ జనరల్ ఏకే సింగ్, అడ్మిరల్ మోంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్‌లు ఈ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
భారత గగనతలం మూసివేత..
భారత్ పాకిస్థాన్‌కు మరో షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు పాకిస్థాన్‌కు చెందిన అన్ని రకాల విమానాలకు భారత గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం వెలువరించింది. పాకిస్థాన్‌కు చెందిన విమానాలు ఇప్పటికే భారత గగనతలం గుండా ప్రయాణించట్లేదు. ఇందుకు సంబంధించి భారత్ నోటమ్ (నోటీస్ టూ ఎయిర్‌మెన్) విడుదల చేసింది.