calender_icon.png 9 November, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిది బ్రదర్స్ బంధం

09-11-2025 01:42:54 AM

  1. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక్కటైన కాంగ్రెస్, బీజేపీ 

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయం

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి) : పెద్దమ్మ, చిన్నమ్మ కుమారుల బంధంలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి కాంట్రాక్టు ఇచ్చారని, టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీ ఎంపీతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి కోసం పని చేస్తున్నారని, బండి సంజయ్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారని అన్నారు. తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలే కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. రామ్ కో సిమెంట్ కంటే దృఢమైన బంధం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య ఉందని స్పష్టం చేశారు. ఎన్నడూ లేని విధంగా సీఎం తొమ్మిది రోజులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం చేశారని, దీంతో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయంగా కనిపిస్తోందన్నారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి ఇళ్లు రాకపోయినా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లపై పోలీసులు రైడ్ చేశారని, ఏమీ దొరకలేదని పోలీసులు చెప్పారని పేర్కొన్నారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయ్యాయని, బండి సంజయ్ వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఉప ఎన్నికలో పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారని, ఏపీలో ఏం జరుగుతుందో పోలీసులు గమనించాలని హితవు పలికారు. అన్ని కుట్రలను జూబ్లీ హిల్స్ ఓటర్లు ఛేదించి, బీఆర్‌ఎస్‌ను గెలిపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.