14 August, 2026 | 8:42 PM

కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అంబాసిడర్

25-05-2024 12:55 AM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరుతారనడాన్నిస్వాగతిస్తున్నా: జగ్గారెడ్డి 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ స్వాగతిస్తోందని, అదే జరిగితే ఆయనను ఘనంగా సన్మానిస్తామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఐనట్టున్నారని, ఐదేళ్లు సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారని, తమ ప్రభుత్వం సేఫ్ అన్నారు.

గాంధీభవన్‌లో శుక్రవారం మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి చాలా గొప్పవారని, వాజ్‌పేయీ దారిలో నడుస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మంచి పనిచేస్తే ప్రతిపక్షంలో ఉన్నా ప్రశంసించే గుణం వాజ్‌పేయీదని, నిండు పార్లమెంట్‌లో ఇందిరాగాంధీని దుర్గామాతతో పోల్చిన అంశాన్ని జగ్గారెడ్డి గుర్తుచేశారు. 25 మంది ఎమ్మెల్యేలు చేరుతున్నారంటే 5 నెలల కాంగ్రెస్ పాల న బాగుందనేది స్ప ష్టమవుతోందన్నారు. ప్రభుత్వాలను పడగొట్టడంలో బీజేపీ నేతలు ప్రొఫెసర్లని, అయినా తెలంగాణ లో ఎన్ని కుట్రలు చేసినా ఫలితం ఉండదన్నారు.

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పోవడంతోనే మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. వరి విషయంలో కిషన్‌రెడ్డికి అవగాహన లేదన్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు రేవంత్‌రెడ్డి మీద బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావులేదని, వాటిని తమ ప్రభుత్వం ప్రొత్సహించదని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మీద కేటీఆర్ నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ రాజకీయ విలువల గురించి మాట్లాడితే నవ్వొస్తుందన్నారు.