ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం
జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఉట్నూర్,(విజయక్రాంతి): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలంటే రైతులు సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడ గ్రామంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఏపీఓ మంద మకరందు తో కలిసి గ్రామంలో స్వయంగా ఆయిల్ పామ్ మొక్కలను నాటి రైతులను ప్రోత్సహించారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఒకసారి ఆయిల్ పామ్ తోటను ఏర్పాటు చేస్తే సుమారు 25 నుంచి 30 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ పంట ద్వారా రైతులు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహక పథకాలను సద్వినియోగం చేసుకుని అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు.
ఐటీడీఏ ఏపీఓ మంద మకరందు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన మొక్కలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, జిల్లా ఉద్యాన అధికారి సందీప్ కుమార్, స్థానిక సర్పంచ్ జమున నాయక్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్,వ్యవసాయ, అధికారులు, రైతులు పాల్గొన్నారు.






