14 August, 2026 | 9:52 PM

తెలంగాణ ఇచ్చింది సోనియానే

25-05-2024 12:53 AM

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై వీ హనుమంతరావు కౌంటర్ 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ  ఏ హోదాలో  వస్తారని కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి మాట్లాడటం సరికాదని పీసీసీ మాజీ చీఫ్ వీ హనుమంతరావు పేర్కొన్నా రు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ ప్రజల కల సాకారమైందనే విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. శుక్రవారం  గాంధీ భవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణకు సోనియా పెద్దమ్మ, తాను చిన్నమ్మ అని పేర్కొన్న బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యలను  గుర్తుచేశారు. 

తెలంగాణ రాకపోతే కేసీఆర్, ఆయన కుటుంబం నాంపల్లి దర్గా వద్ద అడుక్కునేదని విమర్శించారు. బీజేపీ ఒక ఓటుకు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానాన్ని ఉల్లంఘించిన విషయా న్ని కిషన్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు.  పదేళ్లు ప్రధానిగా ఉండి ఏమి చేయని మోదీ 2047 వరకు కష్టపడతాననడం విచిత్రంగా ఉందన్నారు. కులగణన చేయాలని మోదీని ఎన్నోసార్లు కలిసినా పట్టించుకోలేదని, ఓబీసీలకు ఏం చేయలేదన్నారు. అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టారని, బీసీలు ఏమి చేశారని ఆయన నిలదీశారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన చేపట్టేందుకు రాహుల్‌గాంధీ సుముఖంగానే ఉన్నారని పేర్కొన్నారు.