రెండు నెలలుగా జీతాల్లేవు.. కేజేఎల్‌ కార్మికుల ఆందోళన

12-09-2026 | 10:49am

జూలై, ఆగస్టు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌.. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన

భిక్కనూర్, సెప్టెంబర్‌ 12(విజయక్రాంతి): భిక్కనూర్‌ మండలంలోని కాచాపూర్‌ గ్రామ పరిధిలో ఉన్న కేజేఎల్‌ పౌల్ట్రీ కంపెనీలో(KJL Poultry Company) రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. కంపెనీ గేటు ఎదుట పెద్ద సంఖ్యలో కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ‘వీ వాంట్‌ మై సాలరీ’ అంటూ నినాదాలు చేశారు.

కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన

కార్మికులు మాట్లాడుతూ రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల స్కూల్‌ ఫీజులు, ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చులు, ఈఎంఐలు చెల్లించేందుకు డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. జీతాల కోసం యాజమాన్యాన్ని అడిగినప్పటికీ సరైన సమాధానం లభించడం లేదని ఆరోపించారు.

పీఎఫ్‌, ఈఎస్‌ఐపై స్పష్టత ఏది?

కంపెనీలో కార్మిక చట్టాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అనే అంశంపై అధికారులు సమగ్రంగా పరిశీలించాలని కార్మికులు కోరుతున్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలకు సంబంధించిన వివరాలపై స్పష్టత లేదని కొందరు కార్మికులు ఆరోపించారు. తమ వేతనాలు, కార్మిక హక్కుల విషయంలో యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ప్రతి కేజేఎల్‌ పౌల్ట్రీల్లోనూ తనిఖీలు చేయాలని డిమాండ్‌

కాచాపూర్‌ కేజేఎల్‌ పౌల్ట్రీతో పాటు కంచర్ల, పెద్దమల్లారెడ్డి, ఇసన్నపల్లి గ్రామాల పరిధిలోని కేజేఎల్‌ పౌల్ట్రీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైనా అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఆయా సంస్థల్లో వేతనాల చెల్లింపు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, కార్మిక చట్టాల అమలుపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

సమస్య పరిష్కరించకపోతే సమ్మె

పెండింగ్‌ జీతాలను వెంటనే చెల్లించడంతో పాటు ఇకపై సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే లేబర్‌ అధికారులను ఆశ్రయించడంతో పాటు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్మికుల ఆందోళనపై అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు