6 July, 2026 | 4:34 PM

Breaking News

ఏటీఎంగా మార్చుకునేందుకే కాళేశ్వరం   •   అనుమతి లేని తరగతులను సీజ్ చేసిన ఎంఈఓ రాజయ్య   •   ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి: సీఎం రేవంత్​ రెడ్డి   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి   •   8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •  

టాప్ -2 లక్ష్యంగా..

19-05-2024 01:34 AM

నేడు పంజాబ్‌తో హైదరాబాద్ ఢీ

రాజస్థాన్‌తో కోల్‌కతా అమీతుమీ

అంచనాలకు మించి రాణించి.. ప్రత్యర్థులకు నిద్రలేని రాత్రులు మిగిల్చి. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఇప్పుడు పాయింట్ల పట్టికలో టాప్‌టో ప్లేస్‌పై దృష్టి సారించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ సత్తాచాటితే పట్టికలో రెండో స్థానానికి చేరే చాన్స్ ఉంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నేడు హైదరాబాద్‌లో వర్షం పడే సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించగా.. ఇక ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ దశ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనుంది. 

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: మూడేళ్ల నిరీక్షణ అనంతరం ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. మరో విజయం నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరాలని చూస్తోంది. ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరగనున్న తొలి పోరులో పంజాబ్ కింగ్స్‌ను రైజర్స్ ఢీ కొట్టనుంది. సొంతగడ్డపై జరగనున్న ఈ పోరులో ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న పంజాబ్ కింగ్స్‌పై ఆరెంజ్ ఆర్మీ విరుచుకుపడాలని ఆశిస్తుంటే.. సీజన్ మొత్తం పడుతూ లేస్తూ సాగిన పంజాబ్.. విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. గతంలో కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రైజర్స్.. తాజా సీజన్‌లో బ్యాట్‌తో దుమ్మురేపుతోన్న విషయం తెలిసిందే. టాస్ గెలిచిన జట్లు హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాలంటేనే వణికిపోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్, మార్క్మ్,్ర అబ్దుల్ సమద్, నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో హైదరాబాద్‌కు పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక సారథి పాట్ కమిన్స్ అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. బౌలింగ్‌లో భువనేశ్వర్, నటరాజన్ కూడా రాణిస్తుండటంతో రైజర్స్ నిలకడగా విజయాలు సాధిస్తూ వస్తోంది. చివరి లీగ్ మ్యాచ్‌లోనూ ఇదే జోరు కొనసాగించి రెట్టించిన ఉత్సాహంతో రైజర్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని చూస్తోంది. మరోవైపు ఇప్పటికే పరాజయాలతో సతమతమవుతున్న పంజాబ్ కింగ్స్‌కు తాత్కాళిక కెప్టెన్ సామ్ కరన్ కూడా దూరమయ్యాడు. జాతీయ జట్టు ప్రాధామ్యాల వల్ల అతడు చివరి మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా ప్లేయర్ జితేశ్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరి ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి! 

టేబుల్ టాపర్స్ పోరు

గువాహటి: డబుల్ హెడర్‌లో భాగంగా జరగనున్న రెండో పోరులో రాజస్థాన్ రాయల్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిన రాజస్థాన్ గెలుపు బాట పట్టాలని కృతనిశ్చయంతో ఉంది. కోల్‌కతా టేబుల్ టాపర్‌గా కొనసాగుతుండగా.. రెండో స్థానం కోసం హైదరాబాద్ పోటీ పడుతుండటంతో రాయల్స్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. నైట్‌రైడర్స్‌పై గెలిస్తేనే రాజస్థాన్ రెండో స్థానంతో ఎలిమినేటర్ రూపంలో ఫైనల్ చేరేందుకు అదనపు అవకాశం పొందనుంది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి తిరిగి వెళ్లడం రాయల్స్‌కు ఎదురుదెబ్బ కాగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్ సమష్టిగా సత్తాచాటాల్సిన అవసరముంది. కోల్‌కతా విషయానికి వస్తే.. రైజర్స్ మాదిరిగానే వారి ఓపెనర్లు కూడా దంచికొడుతున్నారు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుండటంతో కోల్‌కతా ఈ సీజన్‌లో సునాయాసంగా విజయాలు సాధించగలిగింది. ఈ ఇద్దరూ దాదాపు రెండొందల స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబడుతున్నారు. మిడిలార్డర్ ఐయ్యర్ ద్వయం (శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్) కలిసి కదంతొక్కుతుండగా.. రింకూ సింగ్, రస్సెల్ రూపంలో ధిట్టమైన హిట్టర్లు అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, అశ్విన్, చాహల్‌తో రాజస్థాన్ సవాల్ విసురుతుంటే.. స్టార్క్, వరుణ్ చక్రవర్తి, నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరాతో కోల్‌కతా సమ ఉజ్జీగానే కనిపిస్తోంది.