చెన్నైకి చెక్
ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో చెన్నైపై గెలుపు
ఉత్కంఠ ఊపేసిన పోరులో బెంగళూరు విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కనీసం 18 పరగుల తేడాతో చెన్నైని చిత్తుచేయాల్సిన దశలో ఆర్సీబీ సమష్టిగా సత్తాచాటింది.
ఫలితంగా డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితం కాగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొమ్మిదోసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది.
మొదట బ్యాటింగ్‌లో కోహ్లీ, డుప్లెసిస్, గ్రీన్, రజత్ రాణించడంతో భారీ స్కోరు చేసిన బెంగళూరు.. ఆనక కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెన్నైకి చెక్ పెట్టింది.
తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడింట ఓడినప్పుడు బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుతుందని ఎవరైనా ఊహించి ఉంటారా! హైదరాబాద్ బౌలర్ల చేతిలో చావుదెబ్బ తిన్నప్పుడు మళ్లీ ఆర్సీబీ కోలుకుంటుందని ఎవరైనా అంచనా వేసి ఉంటారా! వరుస పరాజయాల తర్వాత తిరిగి రేసులోకి వస్తామని ప్లేయర్లునా అనుకొని ఉంటారా! కానీ అసాధ్యంలా కనిపించిన దాన్ని సుసాధ్యం చేసి చూపింది ఆర్సీబీ.
బెంగళూరు: చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో బెంగళూరుదే పైచేయి అయింది. శనివారం ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సీజన్ ఆసాంతం రాణించిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) కీలక పోరులో మరోసారి సత్తాచాటగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. లీగ్‌లో అధిక భాగం విరాట్ మెరుపుల మీద ఆధారపడ్డ ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా సత్తాచాటింది.
రజత్ పాటిదార్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), కామెరూన్ గ్రీన్ (17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడారు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, శాంట్నర్, తుషార్ దేశ్ పాండే చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితమైంది. రచిన్ రవీంద్ర (37 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. అజింక్యా రహానే (33; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (22 బంతుల్లో 42 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ధోనీ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, ఒక సిక్సర్) పోరాడినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. డారిల్ (4), దూబే (7), శాంట్నర్ (3) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో యష్ దయాల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
టాప్ ఆర్డర్ అదుర్స్
ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ టాపార్డర్ కలిసి కట్టుగా కదంతొక్కింది. సొంతగడ్డపై జరిగిన పోరులో తలా కొన్ని పరుగులు చేయడంతో బెంగళూరు మంచి స్కోరు చేయగలిగింది. సీజన్ ఆరంభంలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించిన బెంగళూరు.. ఆ తర్వాత గేరు మార్చి వరుసగా ఐదు మ్యాచ్‌లు నెగ్గి ప్లే ఆఫ్స్ రేసులోకి రాగా.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ యూనిట్ అదే స్ఫూర్తి కొనసాగించింది. రెండో ఓవర్‌లో బౌండ్రీతో కోహ్లీ పరుగుల వరదకు తెరతీశాడు. అదే ఓవర్‌లో డుప్లెసిస్ 4,6 బాదగా.. తదుపరి ఓవర్‌లో కోహ్లీ రెండు సిక్సర్లు అరుసుకున్నాడు.
మూడు ఓవర్లు ముగిసిన అనంతరం వర్షం కారణంగా మ్యాచ్‌కు కాస్త అంతరాయం రాగా.. ఆ తర్వాత పరుగుల రాక మందగించింది. ఫలితంగా పవర్‌ప్లేలో బెంగళూరు 42 పరుగులు మాత్రమే చేసింది. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడిన కోహ్లీ అర్ధశతకానికి ముందు డారిల్ మిషెల్ బౌండ్రీ వద్ద పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అక్కడి నుంచి బాదే భాత్యత డుప్లెసిస్ తీసుకున్నాడు. జడేజా బౌలింగ్‌లో ఫాఫ్ 4,6,6 బాదాడు. హాఫ్ సెంచరీ అనంతరం డుప్లెసిస్ రనౌట్ కాగా.. రజత్, గ్రీన్ దంచుడు కొనసాగించారు. ఏ దశలోనూ రన్‌రేట్ పడిపోకుండా చూసుకున్న ఈ జోడీ బౌలర్‌తో సంబధం లేకుండా భారీ షాట్లతో విరుచుకుపడింది. చివర్లో కార్తీక్, మ్యాక్స్‌వెల్ కూడా చెరో చేయి వేయడంతో ఆర్సీబీ స్కోరు రెండొందలు దాటింది.






