17 July, 2026 | 4:36 PM

లోన్ డబ్బుల కోసం కత్తితో దాడి

22-06-2024 01:04 AM

నలుగురు రికవరీ ఏజెంట్ల అరెస్ట్

మహేశ్వరం, జూన్ 21 (విజయక్రాంతి) : బడంగ్‌పేట్‌లో ఓ హోటల్ నిర్వహించే ఆశోక్ కొన్ని నెలల క్రితం పేటీఎం యాప్ ద్వారా లోన్  తీసుకున్నాడు. అయితే, కొంత డబ్బు చెల్లించినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బులు చెల్లించడంలో ఆలస్యమైంది. దీంతో ఆశోక్‌తో పాటు తన స్నేహితులు, బంధువులకు ఫోన్ చేసి రికవరీ ఏజెంట్లు బూతులు తిడుతూ.. డబ్బులు చెల్లించకుంటే చంపుతాం  అంటూ బెదిరించారు. ఈ నెల 20న వారిపై తీవ్రంగా దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కున్నారు. అంతటితో ఆగకుండా శుక్రవారం బడంగ్‌పేట్ హోటల్‌కు వచ్చి కత్తితో హల్‌చల్ చేస్తూ డబ్బులు ఇస్తారా? లేక చంపాలా? అంటూ దాడి చేసే ప్రయత్నం చేశారు. స్థానికులు స్పందించి రికవరీ ఏజెంట్ల నుంచి కత్తి లాక్కున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటహుటిన సంఘటన స్థలానికి చేరుకొని నలుగురు రికవరీ ఏజెంట్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసును మీర్‌పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.