06-02-2026 12:34:20 AM
ముకరంపుర, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): నగరంలోని 21వ డివిజన్లో బీజేపీ అభ్యర్ధి కొండపల్లి సతీష్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. డివిజన్ పరిధిలోని విద్యానగర్, కొత్తయాస్వాడ, శ్రీరాంనగర్ కాలనీ, రేకుర్తి కొత్తవాడ, విజయదుర్గకాలనీ, వినాయకనగర్, వికలాంగులకాలనీ, హరిహరనగర్ కాలనీల్లో ఆయన నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. ఈ సందర్భంగా కొండపల్లి సతీష్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా మాజీ కార్పొరేటర్ స్వర్గీయ బత్తుల వెంకన్న కుటుంబం ప్రజా సేవకే అంకితమైందన్నారు.
డివిజన్ ప్రజల ఆశీస్సులతో మూడుసార్లు గెలిచి అవినీతి రహిత పాలన అందించామన్నారు. డివిజన్లో పలుచోట్ల రోడ్లు కబ్జా కాకుండా కాపాడామని, శ్రీరాంనగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక, శ్రీరామ మందిరాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకున్నామన్నారు. శ్రీ వేంకటేశ్వరకాలనీలో బత్తుల వెంకన్న చిల్డ్రన్స్ పార్క్ స్థలాన్ని కాపాడుకున్నామన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో, అమృత్ పథకం, కేంద్ర, రాష్ట్రాల నిధులతో ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ల సహకారంతో డివిజన్ ను అభివృద్ధి చేశామన్నారు. ప్రజలు మరోసారి గెలిపించాలని కోరారు.