కొండా అఖండ విజయం
రంగారెడ్డి, జూన్ 4 (విజయక్రాంతి): చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగిరింది. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 1,67,656 ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపులో కొండా విశ్వశ్వర్ రెడ్డి మొదటి నుంచి ఆధిక్యత ప్రదర్శించారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం అసెంబ్లీల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 29,38,370 ఓట్లు ఉండగా 16,57,107 పోలయ్యాయి. అందులో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 7,98,517 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 6,30,861, బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు 1,77,540 ఓట్లు వచ్చాయి. కొండా విజయంతో చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో తొలిసారిగా బీజేపీ ఖాతా తెరిచినట్లుంది. ఇప్పటి వరకు ఈ పార్లమెంట్ స్థానానికి నాలుగు సార్లు ఎన్నికలు జరగగా అందులో ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు బీఆర్‌ఎస్, తొలిసారిగా బీజేపీకి ప్రజలు పట్టం కట్టారు.
కాంగ్రెస్‌లో నైరాశ్యం..
కౌంటింగ్ కేంద్రానికి బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు రాగా బీఆర్‌ఎస్ అభ్యర్థి కాసాని రాలేదు. మొత్తం 24 రౌండ్లలో లెక్కింపు చేపట్టగా ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యత ప్రదర్శించింది. రౌండ్ల వారీగా బీజేపీ దూసుకుపోవడంతో కాంగ్రెస్ నాయకుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది. బీజేపీ దూసుకుపోవడంతో గెలుపు పై ఆశలు వదులుకున్న కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యాహ్నం 12 గంటలకే వెళ్లిపోయారు. ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత జిల్లా రిటర్నింగ్ అధికారి శశాంక కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
వ్యాపారవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా..
వికారాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): చేవెళ్ల ఎంపీగా ఎన్నికైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ధర్మసాగర్ గ్రామానికి చెందిన జస్టిస్ కొండా మాధవ రెడ్డి, జయలతా రెడ్డి దంపతులకు 1960 ఫిబ్రవరి 26వ తేదీన జన్మించారు. ఆయనకు భార్య సంగీతా రెడ్డి ఉన్నారు. విశ్వేశ్వర్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యనభ్యసించారు. ఆయన తాత కొండా వెంకట రంగారెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహించిన విశ్వేశ్వర్ రెడ్డి.. 2013లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి చేవెళ్ల ఎంపీగా మొదటిసారి విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్‌లో చేరి, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2022 జూలైలో బీజేపీలో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిపై సుమారు 1,50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.






