06-07-2025 01:36:58 AM
- అసెంబ్లీకి రమ్మంగే బోట్స్ క్లబ్, ప్రెస్ క్లబ్‌కి రా అంటున్నారు
- మీడియా సమావేశంలో జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రైతులకు ఎవరు ఏం చేశారో చర్చిద్దామన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘాటుగా కౌంటరిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మాట్లాడకుండా సెకండ్ బెంచ్ లీడర్స్ మాట్లాడుతున్నారని, కేటీఆర్, హరీశ్‌లు సెకండ్ బెంచ్ లీడర్స్ అని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకిరా అంటే.. బోట్స్ క్లబ్‌కి... ప్రెస్‌క్లబ్‌కి రావాలని కేటీఆర్ అంటున్నారని, ఇంకా రెండు రోజులు ఐతే కల్లు దుకాణానికి రావాలని కేటీఆర్ అంటారేమోనని విమర్శించారు. శనివారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోందన్నారు.
అసెంబ్లీ పెట్టిచర్చించాలని అధికార పార్టీ ప్రతిపక్షం కోరుతుందని, కానీ ఇక్కడ రివర్స్ పరిస్థితి ఉందన్నారు. అసెంబ్లీ పెడతా.. ప్రతిపక్ష నాయకుడు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారన్నారు. కేసీఆర్ సభకు వస్తానంటే అసెంబ్లీ పెట్టేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని గడ్డం పట్టుకుని రేవంత్ రెడ్డి బతిమిలాడుతున్నారని పేర్కొన్నారు.
పులుసులు తిన్నదే మీరు..
ఆంధ్రోళ్లను తిట్టి గ్రేటర్ ఎన్నికలు రాగానే కాలుకు ముళ్లు గుచ్చుకుంటే నోటితో తీస్తా అన్నది కేసీఆర్ కాదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. నీళ్లను దొంగతనం చేసిన వాళ్లను ఇంటికి పిలిచి కేసీఆర్ ఎందుకు మీటింగ్ పెట్టి, భోజనం పెట్టారని ప్రశ్నించారు. మీరు ఇక్కడ కోడి పులుసు తినిపిస్తే వాళ్లు మీకు చేపల పులుసు తినిపించారని విమర్శించారు. మీ పులుసుల కథ బాగానే ఉందని, మధ్యలో తెలంగాణ ప్రజలు ఎలా కనిపిస్తున్నారని నిలదీశారు. ఒకరినొకరు పులుసులు తినుడు కరెక్టే.. మళ్లీ నీళ్ల పంచాయతీ పెట్టుడు కరెక్టే..మధ్యలో తమపై నిందలు ఏందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాళ్లిద్దరూ ఫస్ట్ బెంచ్ వాళ్లే
రేవంత్, కేసీఆర్ ఇద్దరూ మొదటి బెంచ్ వాళ్లేనని జగ్గారెడ్డి అన్నారు. కేటీఆర్‌కి ఇంకా మెచ్యూరిటీ రాలేదన్నారు. గతంలో సభలో ఏం అనక పోయినా కోమటిరెడ్డి , సంపత్‌ల సభ్యత్వమే రద్దు చేశారని గుర్తు చేశారు.