06-07-2025 12:55:11 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజూ విమర్శలు చేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మోటర్లను ఆన్ చేయకుండా రైతును ఇబ్బందులకు గురిచేస్తున్నారని, నీటి విలువ తెలియని వాళ్లు పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలపై కోపంతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ నుంచి 73,600 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉందని, నీటిని తీసుకునే అవకాశం ఉన్నా.. ఎందుకు తీసుకోవట్లేదు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు సాగునీరు అందుతుందని, నీటిని ఎత్తిపోసేందుకు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అడిగారు.
ఎస్ఆర్ఎస్పీ కింద పంటలు వేయాలో వద్దో అని రైతులు ఆలోచిస్తున్నారు. కేసీఆర్ నాయకత్వంలో రైతులందరితో కలిసి కన్నేపల్లికి వెళ్లి మోటార్లు ఆన్ చేస్తామని, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందించాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 20 జిల్లాల రైతులతో కదిలి మోటార్లు ఆన్ చేసి సాగునీరు అందిస్తామని, మేడిగడ్డకు మరమ్మతు చేయాలంటూ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది..?, పోలవరంలో డయాఫ్రాం వాల్ కోట్టుకుపోతే అక్కడికి ఎందుకు పోలేదని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలిపోతే ఎన్డీఎస్ఏ రాలేదు..?, ఎన్డీఎస్ఏ నివేదిక చూపి మేడిగడ్డ మరమ్మతును ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని హరీశ్ రావు అన్నారు.