నిరుద్యోగ యువకుడు వేణును ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
హైదరాబాద్: మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం, న్యూ లక్ష్మీపురంకు చెందిన నిరుద్యోగ యువకుడు వేణు(Unemployed youth venu)ను మంగళవారం బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి(BRS leader Rakesh Reddy) పరామర్శించారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూసిన యువకుడు చివరకు తీవ్ర మనోవేదనతో ఈ నిర్ణయానికి వెళ్లడం అత్యంత బాధాకరమన్నారు.
వేణుతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ద్వారా మాట్లాడి అతనికి ధైర్యం చెప్పి, బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను వ్యక్తిగత కారణాలతో కాదు, ఉద్యోగాల కోసం న్యాయం కోరుతూ ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని వేణు స్పష్టం చేశాడు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని, అలాగే అర్హత ఉన్నప్పటికీ తనకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇవ్వలేదని కూడా వేణు ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.
వేణు రాసిన సూసైడ్ నోట్ ఒక వ్యక్తి బాధ మాత్రమే కాదు, లక్షలాది నిరుద్యోగ యువత గుండె చప్పుడు అని, అదే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు చార్జ్‌షీట్ అని ఆరోపించారు. ఆ ఆధారంగానే ఈ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తామని రాకేష్ భరోసా ఇచ్చారు. నిరుద్యోగ యువత ఆవేదనకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని, యువత ప్రాణాలతో చెలగాటమాడే పాలనకు ప్రజలే తగిన తీర్పు చెబుతారని రాకేష్ తెలిపారు.






