06-02-2026 01:36:03 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలన
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తీర్పు
సిరిసిల్ల ప్రచారంలో కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): సిరిసిల్లలో గురువారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలన మొత్తం హామీల రాజకీయం, మాటల మోసంగా మారిందని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెపుతున్నారని, అయితే అధికారం లోకి వచ్చి ఇప్పటికి ఎన్ని పంటకాలాలు గడిచాయో, ఎన్నిసార్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఆడబి డ్డల పెళ్లికి తులం బంగారం ఇచ్చి చూపండి. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ వేసి చూపండి. అప్పుడే ఓటు అడగండి. మాటలతో కాదు, పనితోనే ప్రజల ముందుకు రావాలి’ అని సవాల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ అవే హామీలు చెప్పి ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రికి అధికారం, అవకాశం ఉన్నప్పటికీ పాలన చేయకుండా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. చేతనైతే ప్రజలకు మేలు చేయాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సూచించారు. ఈ మున్సిపల్ ఎన్నికలు హామీల మోసాలపై ప్రజలు తీర్పు చెప్పే ఎన్నికలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడే ఓటుతో ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక ఇవ్వకపోతే, వచ్చే శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకు ప్రశ్నించే అవకాశం కూడా ఉండదని హెచ్చరిస్తూ, ఈ ఎన్నికల్లో ప్రజలే తుది తీర్పు చెప్పాలని పిలుపునిచ్చారు.