25 July, 2026 | 2:02 PM

ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం

27-06-2024 02:07 PM

హైదరాబాద్: సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, సింగరేణి ప్రాంత నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, బొగ్గు గని కార్మిక సంఘం నాయకులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందన్నారు. కేంద్రంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి వాళ్లకు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లాభసాటిగా ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఆ తర్వాత సింగరేణి నష్టాల్లో ఉందంటూ పెట్టుబడుల ఉపసంహరణ కోసం సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ లు కుమ్మక్కు అయి నవ్వుకుంటూ సింగరేణి గనులను అమ్మకానికి పెట్టినట్లు ప్రతి సింగరేణి కార్మికుని అర్థమవుతోందన్న కేటీఆర్,  కేసీఆర్  ప్రభుత్వ రంగ సంస్థలతో ఉద్యమ కాలం నాటి నుంచే పనిచేస్తున్నారని చెప్పారు.  సకల జనుల సమ్మె సమయంలో సింగరేణి ప్రాధాన్యతను దేశం గుర్తించిందన్నారు. సమ్మె కాలంలో ఐదు దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయని తెలిపారు.

ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతంగా పనిచేశాయని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గొప్పగా పని చేశాయని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం అనేది తమ పార్టీ విధానం అన్నారు.  ఉద్యమ కాలం నుంచి.. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే తమ విధానం అని, అందుకే ప్రైవేటు కంపెనీలు ఎంత ఒత్తిడి తెచ్చిన పక్కకు పెట్టి... రైతు బీమాను ఎల్ఐసీ ఇచ్చామన్నారు. విద్యుత్ ప్రాజెక్టులను కట్టే బాధ్యతలను  బీహెచ్ఈఎల్ కి అప్పగించామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాటు సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణ కోసం పనిచేశామో ప్రతి సింగరేణి కార్మికునికి అవగాహన ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.