17-12-2025 08:36:01 PM
హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్ నిర్ణయంపై స్పందిస్తూ, దేశ అత్యున్నత న్యాయస్థానాలపైనే కాదు, చివరికి రాజ్యాంగంపై కూడా రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని మరోసారి తేలిపోయిందని విమర్శించారు. కేవలం ఫోటోలకు ఫోజులిచ్చేందుకు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
"స్వంత తండ్రి రాజీవ్ గాంధీ తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నే గౌరవించలేని అసమర్థ నాయకుడిగా రాహుల్ గాంధీ చరిత్రలో మిగిలిపోతారని.. అభివృద్ధి కోసం పార్టీ మారినట్టు సాక్షాత్తు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేకసార్లు బాహాటంగా ప్రకటించినా, వారిని కాపాడటం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం" అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనా వైఫల్యాలపై పంచాయతీ ఎన్నికల వేళ పల్లెపల్లెనా ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోందని, ఆ భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలు అంటే జంకుతోందని కేటీఆర్ అన్నారు.
అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తోందని, తెలంగాణ సమాజానికి ఈ విషయం స్పష్టంగా అర్థమైపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి మరీ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పార్టీ ఫిరాయింపులకు తెరతీసిన నాటి నుంచి, నేటి స్పీకర్ నిర్ణయం వరకు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి మేరకు స్పీకర్ కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారన్నారు.
దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పిన తీర్పుల స్ఫూర్తిని పట్టించుకోకుండా, కేవలం ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గి స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్పీకర్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అందులోని నిబంధనలను పట్టించుకోకుండా, ప్రజాస్వామ్య విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారన్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని కేటీఆర్ తెలిపారు. సాంకేతికంగా అడ్డుపెట్టుకుని గోడ దూకిన ఎమ్మెల్యేలను తాత్కాలికంగా కాపాడినట్టు కాంగ్రెస్ సంబరపడినా, ప్రజాక్షేత్రంలో వారిని ఆయా నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడో అనర్హులుగా ప్రకటించేశారని కేటీఆర్ స్పష్టం చేశారు.