calender_icon.png 18 December, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా మూడో విడత పోలింగ్

18-12-2025 12:09:48 AM

  1. జిల్లాలో 81 శాతం పోలింగ్

పల్లెలకు బారులు తీరిన వలస ఓటర్లు 

తుమ్మలూరు లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ 

కందుకూరు/మహేశ్వరం, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లాలో మూడో విడత స్థానికపూర్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1:00 ముగిసింది. మూడో విడతలో ఇబ్రహీంపట్నం కందుకూరు రెవిన్యూ డివిజన్లో ఏడు మండలాల్లో పంచాయతీ పోరు జరిగింది.

మహేశ్వరం కందుకూరు మండలాల్లో 60 పంచాయతీలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని  అబ్దుల్లాపూర్మెట్, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం  మాడ్గుల మండలం లో 73 పంచాయతీ లో ఎన్నికలు జరిగాయి. ఆయా మండలలో  మొత్తం 2,93,952, ఓట్లు కాగా, 2,39,604 ఓట్లు పోలు కాగా  81 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

మూడు గంటలు ట్రాఫిక్ జాం..

మూడో విడత పోలింగ్ ఉండడంతో  వలస ఓటర్లంతా తమ స్వగ్రామాలకు తరలడంతో  సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం 9 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గంటల వరకు  ఎల్బీనగర్ నియోజకవర్గం బి.యన్.రెడ్డి మొదలుకొని  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మాల్ వరకు  భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మాడుగుల మండలం, దేవరకొండ నియోజకవర్గం కు ఓటు వేసేందుకు వెళ్లిన ఓటర్లంతా తిప్పలు పడ్డారు.

మధ్యాహ్నం 1:00 వరకే పోలింగ్ ఉండడంతో పలువురు  ట్రాఫిక్ జామున కారణంగా  తమ ఓటును వినియోగించుకోలేకపోయినావని ఆవేదన వ్యక్తం చేశారు. మాడుగుల మండలంలోని  కొలుకులపల్లి, నాగిళ్ల, పలు గ్రామాలకు చెందిన ఓటర్ల ఇదే పరిస్థితి ఏర్పడింది. స్థానిక పోరులో  గెలుపు ఓటమి లో ఒక్క ఓటు కీలకం కావడంతో  బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు  తమకు ఓటు వేసే ఓటర్లు  ట్రాఫిక్ జామ్ కారణంగా రాలేకపోవడంతో  వారు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలోని కందుకూరు, మహేశ్వరం మండలాల్లో ఆయా గ్రామపంచాయతీలో జరిగిన సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నిక ప్రక్రియ సజావుగా కొనసాగింది ఉదయం 7 గంటల నుండి ఓటు వేయడానికి ఓటర్లు వచ్చి వార్డుల వారీగా ఏర్పాటు చేసిన పోలింగ్ బూతుల్లోకి వెళ్లి ప్రశాంతంగా వారి వారి ఓటు హక్కును కల్పించుకున్నారు.

మహేశ్వరం మండలం పరిధిలోని 28 గ్రామపంచాయతీలో కందుకూరు మండల పరిధిలోని 32 గ్రామపంచాయతీలో అధికారులు ఎన్నికలు నిర్వహించగా అభ్యర్థులు అందరూ ఎన్నికల అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించి పోలింగ్ సజావుగా  జరిగేందుకు కృషి సల్పారు. ఆయా మండలాల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయా రాజకీయ పార్టీల సహకారంతో బందోబస్తు  నిర్వహించారు.

మహేశ్వరం మండల పరిధిలో 80.1శాతం,కందుకూరు మండలంలో 86.73 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల అధికారులు ఆయా గ్రామాలలో పోలింగ్ సరలిని పరిశీలించి గంట గంటకు పోలింగ్ శాతాన్ని ఆయా గ్రామాలలో ఓటర్లకు అభ్యర్థులకు వివరించారు. మహేశ్వరం డిసిపి కందుకూరు మండలంలో పర్యటించి బందోబస్తు ప్రక్రియను పోలింగ్ సర్వే పర్యవేక్షించారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

రంగారెడ్డి, డిసెంబర్ 17( విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికల మూడవ విడత పోలింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి  తెలిపారు. బుధవారం రంగారెడ్డి జిల్లాలో మూడవ విడుతలో 7 మండలాలో ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్బంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మహేశ్వరం మండలంలోని తుమ్మలూర్, మహేశ్వరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీ చేయు సర్పంచి, వార్డు సభ్యుల జాబితాను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలనీ సంబంధిత స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరి చూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి చిన్న పొరపాట్లుకు తావ్వివకుండా సజావుగా నిర్వహించాలన్నారు.

మధ్యాహ్నం ఒంటి గంట లోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం గేటు లోపలికి ఎవ్వరిని అనుమతించకూడదనీ, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని, కౌంటింగ్ ప్రక్రియలో చిన్న తప్పిదాలకు తావ్వివకుండా ప్రశాంతగా కౌంటింగ్ చేపట్టాలని కలెక్టర్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారులను ఆదేశించారు.