1 June, 2026 | 3:19 AM

సీఎంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం

01-06-2026 02:28 AM
  1. 3 గంటల విద్యుత్ సరిపోతుందని సీఎం ఎప్పుడూ అనలేదు
  2. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్
  3. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ఆ మాట ఎప్పుడూ అనలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మా హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని కేటీఆర్ బడాయి కబుర్లు చెపుతున్నారని, కేసీఆర్ హయాంలో 12 గంటల కరెంట్ మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.

ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఉచిత్ విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని తొలి సంతకం చేసిందే కాంగ్రెస్ పార్టీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. రైతును రాజు చేయాలన్న ఆలోచనతోనే కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో ఏ నాడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వలేదన్నారు. నాణ్యమైన విద్యుత్‌ను ఎలాంటి అంతరాయాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.

మా ప్రభుత్వం రైతు డిస్కం పెడితే కేటీఆర్‌కు ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు. మోటార్లకు మీటర్లపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మీటర్లపై సీఎం విసిరిన సవాల్‌ను కేటీఆర్ ఎందుకు స్వీకరించడం లేదని నిలదీశారు. కేటీఆర్ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇకపై తప్పుడు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ లక్షలాది మంది కార్యకర్తలు చూస్తు ఊరుకోరని హెచ్చరించారు. పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్న నిన్ను సన్నాసి అనాలా లేక ఏం అనాలో కూడా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతుల విషయంలో దుష్ప్రచారం మానుకోవాలని కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ హితవు పలికారు.