28 July, 2026 | 12:55 AM

జిల్లా ఆస్పత్రిలో దౌర్భాగ్య పరిస్థితి!

28-07-2026 12:00 AM
  1. పైప్‌లైన్‌లు జామ్
  2. మరుగుదొడ్ల కు తాళాలు 
  3.  బాటిళ్లలో మూత్ర విసర్జన వార్డుల్లో దుర్వాసన

భూపాలపల్లి, జులై 27(విజయ క్రాంతి): భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి నిర్వహణలో దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. పూడుకుపోయిన పైప్ లైన్లకు నెలల తరబడి మరమ్మతులు నిర్వహించకుండా, మరుగుదొడ్లను వినియోగించకుండా తాళాలు వేశారు. దీనితో ఆసుపత్రికి వచ్చే మహిళా రోగులు గత్యంతరం లేని పరిస్థితులు బాటిళ్లలో మూత్ర విసర్జన చేసి బయట పడేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధా న ఆసుపత్రిలో మరుగుదొడ్ల సమస్య తీవ్రం గా మారి, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన రోగులు ఆరోగ్య సమస్యలతో పాటు మరుగుదొడ్ల లేమితో అష్ట కష్టాలు ఎదుర్కొం టున్నారు. ఆసుపత్రిలోని పలు వార్డుల్లో ఉ న్న మరుగుదొడ్ల పైప్ లైన్లు పూర్తిగా జామ్ అయి పనిచేయకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది.

వార్డుల నుండి బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో కొందరు రోగులు నీటి బాటిళ్లలోనే మూత్ర విసర్జన చేసి వాటిని బయట పడేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరికొం దరు రోగులు ఈ అసౌ కర్యాల కారణంగా పూర్తిగా కోలుకోకముందే ఆసుపత్రి విడిచి ఇంటి ముఖం పడుతున్నా రు. మరుగుదొడ్లలో నీటి సరఫరా లేకపోవడం, శుభ్రత లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ల డానికే భయపడుతున్నామని రోగులు చెబుతున్నారు.

గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలో పైప్లైన్ సమస్యల కారణంగా మరుగుదొడ్లు పనిచేయడం లేదు. ఈ సమస్యపై గత నాలుగు నెలలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తంగా మారి ఇబ్బందులు పడు తున్నా అధికార యంత్రాంగం చోద్యం చూ స్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఆసుపత్రిలో సుమారు 10 నుంచి 15 మరుగుదొడ్లకు మూడు నెలలుగా తాళాలు వేసా రు. దీంతో రోగులు, వారి బంధువులు మ రుగుదొడ్ల అవసరాల కోసం ఆసుపత్రి బయటకు వెళ్లాల్సి వస్తోంది. పనిచేస్తున్న కొ ద్ది మరుగుదొడ్లలో కూడా నీటి సదుపాయం లేకపోవడంతో అవి వాడుకకు అనుకూలంగా లేవు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో దుర్వాసన వెదజల్లుతోంది.

సులభ్ సముదాయలు నిర్మించాలి

జిల్లా ప్రధాన ఆసుపత్రికి స్థానికులతో పాటు సమీప రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం తీవ్ర అసౌకర్యంగా మారింది. ఆసుపత్రి ప్రాంగణంలో ఆధునిక ‘సులభ్’ సముదాయం నిర్మిస్తే మహిళలు, పురుషులకు ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి మరుగుదొడ్ల మరమ్మత్తులు చేపట్టి, అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.

 నాగుల అరవింద్,అమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్