ఐఐటీ విద్యార్థికి కేటీఆర్ భరోసా
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా విద్యార్థులకు సహాయసహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్ తన తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతతో కలిసి సోమవారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
నేత కుటుంబానికి చెందిన అభినవ్‌ను ఐఐటీలో సీటు సాధించడంతో కేటీఆర్ శాలువాతో సత్కరించారు. విద్యార్థికి ల్యాప్‌టాప్‌ను గిఫ్ట్ ఏ స్మైల్ కింద అందజేశారు. కళాశాల ఫీజు కూడా చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌కు అభినవ్, తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ శ్రీలత కృతజ్ఞతలు తెలిపారు.






