విద్యుత్ వైర్లు తగిలి టిప్పర్ దగ్ధం
- పెద్దపల్లి మండలం రంగాపూర్ శివారులో ఘటన
- తప్పిన ప్రాణాపాయం
పెద్దపల్లి, మే 31 (విజయక్రాంతి): పెద్దపల్లి మండలం రంగపూర్ శివారులోని ఇటుక బట్టీలో ఆదివారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్‌తో పాటు కార్మికులు సకాలంలో అప్రమత్తం కావడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెద్దపల్లి మండలం రంగపూర్ శివారులోని వీబీఎస్ ఇటుక బట్టీకి వచ్చి టిప్పర్ లారీ మట్టిని అన్‌లోడ్ చేసున్న క్రమంలో ప్రమాదవశాత్తు పైన ఉన్న 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలకు ఆ టిప్పర్ బాడీ తగిలింది.
దీంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఇటుక బట్టీ కార్మికులు వెంటనే మంటలను అదుపు చేయడానికి శతవిధాలా ప్రయత్నించినా టిప్పర్ లారీ పూర్తిగా కాలి బూడిదైంది.ప్రమాదం జరిగిన సమయంలో క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న కార్మికులు పక్కకు తప్పుకోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో యాజమాన్యం, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తు చేపట్టారు.






