06-10-2025 10:59:29 AM
పోలీసుల వైఖరి కి నిరసన
హిందూ సంప్రదాయాలను గౌరవించడం లేదని పలువురు ఆరోపణ
పండుగలపై ఆంక్షలు విధించవద్దని డిమాండ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): హిందువుల పండుగలపై పోలీసులు విధిస్తున్న ఆంక్షలు నిరసనగా సోమవారం జిల్లా కేంద్రం లో అఖిలపక్షం,పలు సంఘాల పిలుపుమేరకు వ్యాపార సంస్థలు బందులో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన వినాయక నిమజ్జన వేడుకలు,బతుకమ్మ సంబరాలు,దుర్గ,శారద మాత నిమజ్జన వేడుకల్లో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని పలువురు మండిపడుతున్నారు.దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన నిమజ్జన వేడుకల్లో పోలీసులు అత్యుత్సాహాన్ని చూపెట్టడంతోపాటు మహిళల పట్ల అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.దీంతోపాటు పలువురుపై కేసు నమోదు చేయడంతో పాటు ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన డీజే లను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసులు పెట్టడంతో రాజకీయ పార్టీల నాయకులు, పలు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. పండుగల పై పోలీసులు ఆంక్షల విధింపును విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.పట్టణ బందులో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారు.