06-10-2025 12:35:13 PM
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్(BC Reservations)లపై సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీరికల్ డాటా ఆధారంగా రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం ఎంపీరికల్ డాటాతో సీపెక్స్ సర్వే చేసిందని వెల్లడించారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో వాదనలు గట్టిగా వినిపిస్తామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.
రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో పోరాడతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీకి బయలుదేరారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున బలమైన వాదనలు వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి సీనియర్ న్యాయవాదులను కలిసి న్యాయపరమైన అంశాలపై చర్చించారు. ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించాలని సూచనలు చేశారు.