03-12-2025 12:37:29 AM
-గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రూ. 175 కోట్ల కేటాయింపు
-ఇప్పటికీ విడుదల కాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు
-నిధులు విడుదల చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఎంపీడీఓల విజ్ఞప్తి
-ఏసీ బిల్లు తరహాలో కాకుండా డీసీ బిల్లు లాగా ఇవ్వాలని వినతి
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నిక లకు సంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్ని కల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో మొదటి, రెండో విడత నామినేషన్ల స్వీకరణ కూడా పూర్తయ్యింది.
ఇంకా మూ డో విడత నామినేషన్ల స్వీకరణ కూడా మొ దలు కానున్నది. కానీ ఎన్నికల ఏర్పాట్లపై మాత్రం స్పష్టత రావడం లేదు. దీని ప్రధాన కారణం ఎన్నికల నిర్వహణ సామగ్రి, అలవెన్స్, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన నిధు లు అందుబాటులో లేకపోవడమే.
అయితే, తాజాగా నిధుల విడుదలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్‌కు వినతిపత్రం ఇవ్వడమే దీనికి నిదర్శనం. వాస్తవానికి సెప్టెంబర్‌లో మొదటిసారి రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఏర్పాట్ల కోసం రూ. 175 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నిధు ల్లో 25 శాతం అబ్స్రాక్ట్ కంటింగ్జెంట్(ఏసీ) బిల్లుల రూపంలో, 75 శాతం డీటెయిల్డ్ కంటింగ్జెంట్(డీసీ) బిల్లుల రూపంలో ఖర్చు చేయాలని సూచించింది. అయితే ఈ నిధులను గ్రామ పంచాయతీ ఎన్నికలకు కావల సిన అన్ని ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఎన్నికల సామగ్రి, హ్యాండ్‌బుక్స్, ఫార్మ్స్, స్టేషనరీ, వాహనాల అద్దె, ఇంధనం, ఇతర ఖర్చులు, పోలింగ్ సిబ్బందికి ప్రయాణ భత్యం, పోస్టేజ్, ఫోన్ బిల్లు వంటి కార్యాల య ఖర్చులు వినియోగిస్తారు.
మొత్తం నిధు ల్లో రూ. 46 కోట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి, రూ.129 కోట్లు అన్ని జిల్లాల జిల్లా పంచాయతీ అధికారులకు పంపిణీ అవుతాయి. దీంతోపాటు అన్ని వెంటనే బడ్జెట్ అనుమతులు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీపీవోలు, కమిషనర్ కార్యాలయం వెంటనే బిల్లులు సమర్పించి నిధులు వినియోగించాలని సూచించింది.
నిధుల కొరతతో ఎదురవుతున్న సమస్యలు
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణలో సజావుగా నిర్వహించేందుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు(ఎంపీడీఓ) వెం టనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తులు వెలువడుతున్నాయి. నిధుల విడుదలలో నిబంధనల కారణంగా ప్రస్తుతం అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
ఎంపీడీఓ కార్యా లయాలు ఎన్నికల కోసం అవసరమైన ఖ ర్చుల్లో ముఖ్యంగా జిరాక్స్ చార్జీలు, పోలింగ్ సిబ్బంది భోజనాలు, అలవెన్సులు, చెక్‌పోస్టుల ఏర్పాటు, వెబ్‌కాస్టింగ్ సౌకర్యాలు వంటివి నిర్వహించడానికి సరిపడా నిధులు లేవని అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందు స్థానిక ఎన్నికల కోసం రూ. 315 కోట్లు కేటాయించినప్పటికీ, అవి గత ఎన్నికలకే వినియోగించామని, ప్రస్తుత ఎన్నికల కోసం కొత్త నిధుల కేటాయింపు జరగలేదని స్పష్టం చేస్తున్నారు.
దీనికితోడు ఒక్క పోలిం గ్ స్టేషన్ ఏర్పాటు ఖర్చు సుమారు రూ. 20,000కి పెరగడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ విధానం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చేయ డం ద్వారా దాదాపు రూ. 3,000 కోట్ల కేం ద్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్‌లు ల్యాప్స్ కా కుండా కాపాడవచ్చు.
ఈ నిర్ణయం గ్రామీణ పాలనలో ఎన్నికల ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. ఎంపీడీఓలు గ్రామీణాభివృద్ధి పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషి స్తారు. ఎన్నికలను గ్రామ స్థాయిలో సజావుగా నిర్వహించడంలోనూ ప్రధానంగా ని లుస్తారు. సరిపడా నిధులు లేకపోవడం వల్ల ఎన్నికల ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించలేకపోతున్నారు.
ఇది మొత్తం ఎన్నికల ప్ర క్రియను దెబ్బతీసే ప్రమాదం ఉంది. రాష్ర్ట ఎన్నికల సంఘం కూడా ఈ ఖర్చులను తీర్చడానికి నిధుల తక్షణ విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి ఆటంకాలు లేకుం డా సాగేందుకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.
ఏసీ బిల్లు, డీసీ బిల్లు...
ఏసీ బిల్లు అంటే ముందుగా ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని తరువాత ఖర్చు చేసి న వివరాలు, అసలు బిల్లులు తర్వాత సమర్పించే విధానం. అంటే ముందుగా అడ్వా న్స్‌గా నిధులు తీసుకుని పనులు చేయ డం. ఖర్చు చేసిన తర్వాత అసలు రసీదులు / బిల్లులు డీసీ బిల్ ద్వారా సమర్పించాలి.
ఏసీ బిల్లులను అత్యవసర ఖర్చులు ఉన్నప్పుడు, వెంటనే డబ్బు కావాల్సిన పనుల్లో, ఎన్నికలు, అత్యవసర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఎన్నికల కోసం వెంటనే టెంట్లు, వాహనాలు, స్టేషనరీ కొనాలి, అప్పుడు వెంటనే చెల్లించడానికి ఏసీ బిల్లులు ఉపయోగిస్తారు. డీసీ బిల్లు అంటే ఖర్చు చేసి తర్వాత వివరాలు చూపించే విధానం. డీసీ బిల్లుల్లో తప్పనిసరిగా అన్ని రసీదులు జత చేయాల్సి ఉంటుంది. డీసీ బిల్లులను ఆడిట్ కోసం వాడతారు.
100 శాతం డీసీ బిల్లులకు అనుమతివ్వాలి
గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులు 25 శాతం ఏసీ బిల్స్ ద్వారా, 75 శాతం బిల్స్ ద్వారా తీసుకోవాలనే నిబంధన ఉంది. ఈ కారణంగా క్షేత్ర స్థాయిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని ఎంపీడీఓలు చెబుతున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల పనులు అత్యవసరమైనవని, నిధులు ఖర్చులు చేయాల్సి ఉంటుంది. కానీ ఏసీ బిల్లుల నిబంధనల వల్ల ఆలస్యమవుతుంది. ఎన్నికలకు కావలసిన వస్తువులు, స్టేషనరీ, హ్యాండ్‌బుక్స్, ఎన్నికల సామగ్రి, వాహనాలు, ఇంధనం, మానవ వనరులకు చెల్లింపులు కావాలి. స్ప్లిట్ బిల్లింగ్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని తెలుపుతున్నారు.
జిల్లాల్లో ఉన్న అధికారులు పలు శాఖల నుంచి వనరులు సమకూర్చుకోవాలి. ఇందులో భాగంగా గ్రాంట్ విడుదల కావడం వల్ల క్యాష్ ఫ్లో సమస్యలు రావడంతో ఎన్నికల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతోందని చెబుతున్నారు. డీసీ బిల్ ద్వారా 100శాతం విడుదల జరిగితే పారదర్శకత, సమయానికి లెక్కలు పూర్తవుతాయని వివరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన మొత్తం గ్రాంట్‌ను ఏసీ/డీసీ నిబంధనల లేకుండా 100 శాతం డీసీ బిల్స్ ద్వారా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.