03-12-2025 12:30:28 AM
-కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లు పెట్టాలి
-పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇవ్వాలి
-బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
-చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ
మహబూబాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లు పెట్టాలని, ఆ బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించే బాధ్యత ఆ రెండు పార్టీలదేనని స్పష్టం చేశారు.
పార్లమెంట్‌లో జరిగిన బీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు, అధికారపక్షం ఎజెండాలో చేర్చాలని మాట్లాడకపోవ డం దేశంలోని 80 కోట్ల మంది బీసీలను వంచించడమేనని అన్నారు. మంగళవారం హనుమకొండలో బీసీ జేఏసీ వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఈ నెల 8, 9 తేదీల్లో చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే రా జ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీ బి ల్లుకు మద్దతు తెలుపుతారని, లేదంటే బీజేపీ బీసీలకు శాశ్వత శత్రువుగా మారిపోవడం ఖాయమన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీ ల విషయంలో కపట నీతిని అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. అగ్రకుల రిజర్వేషన్ల విషయంలో సానుకూలంగా స్పందించి, 48 గంటల్లోనే చట్టాన్ని చేసుకున్న ఈ పార్టీలు బీసీ రిజర్వేషన్ల విషయంలో ద్వంద విధానాలు అవలంబిస్తున్నాయని విమర్శించారు. కామారెడ్డి డెకరేషన్ ద్వారా 42 శా తం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాటలు నీటి మూటలుగా మారాయన్నా రు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉన్న 23 శాతం రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించి బీసీలను నమ్మించి నట్టేట ముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రెండు సంవత్సరాల పాలనలో 59 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టాడని, ఇప్పుడు 60 వ సారి బీసీల కోసం అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ జరపాలని, కాంగ్రెస్ అధిష్టానం, ఇండియా కూట మినేతలతో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటును కాంగ్రెస్ వైపు నుండి రాజకీయ పోరాట కార్యాచరణలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశాల్లోనే బీసీ బిల్లు ఆమోదంపై అధికార, విపక్ష సభ్యులు చర్చకు పట్టు పట్టాలని కోరారు. లేదంటే ఎంపీల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 8, 9న చలో ఢిల్లీ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నామని, 9వ తేదీన వేలాది మందితో పార్లమెంటును ముట్టడిస్తామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
హనుమకొండలో నిర్వహించిన ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, బోనగాని యాదగిరి గౌడ్, దొడ్డపల్లి రఘుపతి, తమ్మేలా శోభరాణి, మాదం పద్మజ దేవి, తెల్ల సుగుణ, పల్లెపు సమ్మయ్య, అమరావది సారంగపాణి, చిర్ర సుమన్ గౌడ్, కరుణ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.