అందుబాటులో 60 లక్షల పత్తి విత్తనాలు
పత్తి, జీలుగ విత్తనాల కోసం ప్రత్యేక కౌంటర్లు
అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రైతుల అవసరం మేరకు పత్తి, జీలుగ విత్తనాలు పంపిణీ చేయాలని, ఎక్కువ సంఖ్యలో రైతులు వస్తే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆదేశించారు. సచివాలయంలో పత్తి విత్తనాల సరఫరా లభ్యతపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలవారీగా ఇప్పటివరకు 60 లక్షలకుపైగా వివిధ కంపెనీల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించగా, మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5 నాటికి జిల్లాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక నుంచి జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు నిత్యం పత్తి, జీలుగ, జనుము విత్తనాలు సరఫరా చేసే కేంద్రాలను పర్యటిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు విత్తన కంపెనీల ప్రతినిధులను పిలిపించి వారితో మాట్లాడారు. రాష్ట్రంలో గతవారంలో కురిసిన వానలకు రైతులు దుక్కులు చేసుకొని సిద్ధంగా ఉన్నారని, అందుకు విత్తన కంపెనీలు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మిగతా పత్తి విత్తన ప్యాకెట్లను కూడా సకాలంలో చేరవేర్చాల్సిందిగా సూచించారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఒక కంపెనీకి చెందిన విత్తనాలను రైతులందరూ కొనుగోలు చేస్తున్నారని, యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం మార్కెట్‌లో లభ్యమవుతున్న పత్తి విత్తన హైబ్రిడ్ల దిగుబడి ఒకటేనని, ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రోజూ జిల్లాల వారీగా కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్ల పంపిణీ, కొనుగోలు వివరాలపై నివేదిక ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో పత్తి, పచ్చిరొట్ట విత్తనాలు అవసరం మేరకు ఉన్నాయని రైతులు ఎవరూ తొందరపడకుండా ప్రభు త్వ ఆమోదిత దుకాణాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. వాటి బిల్లులను తీసుకుని భద్రపరుచుకోవాలని సూచించారు.






