కృత్రిమ విత్తన కొరత సృష్టిస్తే పీడీ యాక్ట్
ఎరువులు, విత్తనాలు సరిపడా ఉన్నాయి
అన్నదాతలు ఎలాంటి ఆందోళన పడవద్దు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్లకు తరలించి, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2న జరిపే రాష్ట్ర శతాబ్ది ఉత్సవాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించి గతేడాదికి మించి వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
విత్తనాల పంపిణీలో ఏ విధమైన ఆందోళన చెందవద్దని రైతులకు సూచించారు. తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని, వీటితో పాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంత అందుబాటులో ఉంచినట్లు వివరించారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలు తనిఖీ చేయించాలని ఆదేశించారు. దీనితో పాటు గోదాములు, విత్తన విక్రయ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు.
జూన్ మాసాంతం వరకు విత్తన విక్రయాలు కొనసాగే అవకాశం ఉన్నందున కలెక్టర్లు రోజూ విత్తన పంపిణీపై సమీక్షించడంతో పాటు విధిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానాలు పరిశీలించాలన్నారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాల లభ్యత సమాచారం రైతులకు ఎప్పటికప్పడు తెలియజేయాలని సూచించారు.
జూన్ 2న జిల్లాల్లో జెండావిష్కరణ
తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారికి నివాళ్లు అర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ చేయాలని శాంతికుమారి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు, జిల్లా అధికారులను ఆహ్వానించాలని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపారు.






