14-11-2025 08:12:01 PM
జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్
గద్వాల,(విజయక్రాంతి): భూభారతి, సాదాబైనామా, తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల సందర్భంగా 6391 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్న ఆయా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన వివిధ భూములు పలుచోట్ల ఆక్రమణలకు గురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై దృష్టి పెట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, తదితర దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జిల్లాలో ఇప్పటిదాకా 35% మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది అన్నారు. ఆయా పోలింగ్ స్టేషన్ల వారీగా సూపర్వైజర్లు, బిఎల్ఓ లు మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను తహసిల్దార్ లు తరచూ సందర్శిస్తూ అక్కడి కార్యకలాపాలపై పర్యవేక్షణ చేయాలని, అలసత్వం వహించే వారిపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, ఆయా మండలాల తహసిల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.