రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాలలో జిల్లాలో భూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. శ్రీనివాస్ లతో కలిసి లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. రీ-సర్వేలో భాగంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, జిల్లాలోని ప్రభుత్వ భూములు, అటవీ భూములు, గ్రామాల హద్దులు తదితర ప్రాంతాలను సమగ్రంగా సర్వే చేయాలన్నారు.
ప్రతి బృందం లక్ష్యానికి అనుగుణంగా సర్వే పనులను పూర్తి చేయాలని, ఒక బృందం రోజుకు 30 ఎకరాల వరకు సర్వే చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని, సర్వే, కొ-రిలేషన్ స్టేట్‌మెంట్ తయారీతో పాటు నోటీసుల జారీ ప్రక్రియను ఏకకాలంలో చేపట్టాలని, రైతులకు నోటీసులు సకాలంలో అందజేయాలని, రీ-సర్వే ప్రక్రియపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. నోటీసుల జారీలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, గ్రామాల హద్దుల నిర్ధారణకు సంబంధించిన సమాచారం సర్పంచులు, రైతులకు అందించాలని, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రీ-సర్వే ప్రక్రియలో ప్రజల సహకారం తీసుకుని పారదర్శకంగా పనులను పూర్తి చేయాలన్నారు.
రీ-సర్వేకు సంబంధించి ఫారాలు అందుబాటులో ఉన్నాయని, నిబంధనల ప్రకారం సక్రమంగా పూర్తి చేసి రికార్డులను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో రీ-సర్వేకు పైలట్ గ్రామంగా తాండూర్ మండలంలోని రాంపూర్ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, గ్రామంలో సుమారు 581 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ప్రతి మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, ఆ గ్రామంలో రీ-సర్వే ప్రక్రియపై అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. రీ-సర్వే పనులపై తహసిల్దార్లు ప్రత్యేక చొరవ చూపి క్షేత్రస్థాయిలో పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. జి.పి.ఓ.లు భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులను సక్రమంగా సిద్ధం చేసి, రీ-సర్వేకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు.
భూముల రిజిస్ట్రేషన్ సమయంలో తహసిల్దార్ కార్యాలయాలలో సీలింగ్ డిక్లరేషన్‌ను పరిశీలించి, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. భూభారతి దరఖాస్తులలో భూమి విస్తీర్ణానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎస్.ఐ.ఆర్. నోటీసుల జారీ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, జిల్లాలో ఎస్.ఐ.ఆర్. ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రీ-సర్వే, ఎస్.ఐ.ఆర్., రెవెన్యూ రికార్డుల నవీకరణ ప్రక్రియలు సమన్వయంతో కొనసాగిస్తూ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు సహా జిల్లాలోని అన్ని భూముల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా సర్వే చేసి, రికార్డులను నవీకరించాలని సూచించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని, ప్రతి రోజు సాధించిన పురోగతిని సమీక్షిస్తూ రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.






