కంటోన్మెంట్‌లో భూ దందా!
- ప్రైవేటు పరమైన ప్రభుత్వ భూమి?
- స్థానిక నేతలు, అధికారులకు ముడుపులు!
- ఎమ్మెల్యే భూములను ఎందుకు కాపాడుతలేరు?
- బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్
సికింద్రాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వివాదాస్పద సర్వే నంబర్ 157/1 భూమిని శుక్రవారం బీఆర్‌ఎస్ నేత మన్నే క్రిశాంక్ పరిశీలించి, పోలీసుల అనుమతితో అక్కడే మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడు తూ.. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు కట్టుబడి పనిచేశారని ప్రస్తుతం అలాంటి చొరవ స్థానిక ఎమ్మెల్యేలో కనిపించడం లేదు అని అన్నారు.
కంటోన్మెంట్‌లో ఆరు వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతామని ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ భూమిని ఇందిరమ్మ ఇండ్లకు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నిచారు. బోయిన్‌పల్లి భూమి ప్రయివేటు వ్యక్తులకు కేటాయింపు సక్రమమా, అక్రమమా అనే విషయంపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఈ ఘటనపై స్పందిచక పోవడం, తహసీల్దార్, ఆర్డీవోలను ప్రశ్నిచకపోవడం, ప్రభుత్వం తరఫున న్యాయపరమైన చర్యలు చేపట్టకపోవడంపై స్థానిక ఎమ్మెల్యేను నిలదీశారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయం లో ప్రజలకు సమాధానం చెప్పాలని క్రిశాంక్ డిమాండ్ చేసారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము అని చెప్పిన మంత్రి ఈనాటికీ పనులు పూర్తి చేయలేదన్నారు. గత ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్థానిక ప్రజలను ఓట్లు అడిగి, నమ్మించి కంటోన్మెంట్ ప్రజలు ఓట్లు వేసిన తరువాత మంత్రి సీతక్కను ముఖ్యమంత్రి సలహాదారుడైన వేం నరేందర్‌రెడ్డిని స్థానిక ఎమ్మెల్యే వెళ్లి వినతిపత్రాన్ని ఇచ్చి బోయినపల్లి మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారని చెప్పారు.
వారికి స్థానిక ఎమ్మెల్యే వినతిపత్రాన్ని అందిస్తున్న ఫోటోలను మీడియాకు చూపించి ఇది అదే స్థలం అని క్రిశాంక్ వెల్లడించారు. అలాంటి ప్రభుత్వ భూమి ఒక సంవత్సరంలోనే ప్రైవేటు భూమిగా ఎట్లా మారిందని ప్రశ్నిచారు. స్థానిక రాజకీయనాయకులకు, అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారాయని క్రిశాంక్ అన్నారు. ఈ భూమిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అన్నారు.






