రాజాపూర్‌లో కుంగిన భూమి.. భయాందోళనలో గ్రామస్తులు
సింగరేణి బ్లాస్టింగ్‌లతోనే భూమి కుంగుతోందని ఆరోపణలు
సింగరేణి అధికారులు వెంటనే పరిశీలించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
రామగిరి,ఆగస్టు23(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) రామగిరి మండలం(Ramagiri Mandal) రాజాపూర్ గ్రామంలో భూమి కుంగిపోవడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సింగరేణి ఓసీపీ–2 విస్తరణలో భాగంగా గ్రామానికి సమీపంలో జరుగుతున్న బ్లాస్టింగ్‌ల కారణంగానే భూమి కుంగిపోతున్నట్లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి చెందిన పుల్లెల సుధాకర్ ఇంటి సమీపంలో భూమి కుంగి పగుళ్లు ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. కుంగిన ప్రాంతంలో ఇనుప రాడ్‌ను దించగా సుమారు 14 అడుగుల లోతు వరకు వెళ్లినట్లు పేర్కొన్నారు. దీంతో భూమి లోపల ఖాళీలు ఏర్పడి కుంగిపోతుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే సింగరేణి బ్లాస్టింగ్‌ల ప్రభావంతో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని రాజాపూర్ భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా భూమి కుంగిన ఘటన మరింత కలకలం రేపుతోంది. అధికారులు తక్షణమే సంఘటనా స్థలాన్ని పరిశీలించి భూమి కుంగిపోవడానికి గల కారణాలను శాస్త్రీయంగా నిర్ధారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రమాదకర ప్రాంతాన్ని పరిశీలించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, బ్లాస్టింగ్‌ల ప్రభావంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






