23 August, 2026 | 9:10 PM

శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవం

23-08-2026 08:20 PM

కొత్తగూడెంటౌన్, ఆగస్టు 23,(విజయక్రాంతి): దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం పట్టణంలోని శ్రీ పాండురంగ భజన మందిరం ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారు, శ్రీ పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవాలు ఐదు రోజులపాటు పాంచాహ్నిక దీక్షాపూర్వకంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ఐదవ రోజు, ఆఖరి రోజున ఉదయం 6 గంటలకు మంగళ వాయిద్యాలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 8.30 గంటల నుంచి ప్రాతఃకాల అర్చనలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు మూర్తుల స్థానములు, గర్తన్యాసం, బీజ, ఓషధి, రత్నన్యాస కార్యక్రమాలు చేపట్టారు.

ఉదయం 11.25 గంటలకు మూలా నక్షత్ర యుక్త తులా లగ్నంలో యంత్ర, విగ్రహ స్థిర ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు శాంతి కల్యాణం, బలిహరణ, ధేను దర్శనం కార్యక్రమాలు నిర్వహించి, భక్తులకు స్వామివారి దర్శనం, ఆశీర్వచనం కల్పించారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలను బ్రహ్మర్షి శ్రీ చేబ్రోలు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలోని వేద పండితులు, అర్చక బృందం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి  కె. సులోచన, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఆలయ నిర్మాణ దాతలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.