20-02-2026 12:42:57 AM
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 19 : న్యాయవాది కుటుంబం పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కోర్టు విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్ట అనంతరెడ్డి మంద నగేష్ లు మాట్లాడుతూ దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాది జి.నరేష్ నివాసంపై బుధవారం రాత్రి కొంతమంది దుండగులు దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా హత్యాయత్నానికి కూడా వెనుకాడకపోవడం అమానుషమైన చర్య అన్నారు.
ఆయన భార్య, చిన్న కూతురిపై విచక్షణారహితంగా దాడి చేయడం మనసును కలచివేసే ఘటన అన్నారు.ఇది కేవలం ఒక వ్యక్తిపై దాడి కాదని న్యాయవృత్తి పట్ల ఉన్న ద్వేష భావనకు, న్యాయ పరిరక్షణ వ్యవస్థపై ఉన్న సవాల్కు స్పష్టమైన నిదర్శనం అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది న్యాయవాదులు ఎస్‌ఐ కి ఫిర్యాదు చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు జి వెంకటేశ్వర్లు, ఎస్ ఆర్ ఠాగూర్, జె.భాస్కర్ రెడ్డి ఎం నాగిరెడ్డి, టి.కిషోర్ కుమార్, పి.శేఖర్, జనిగల రాములు, జి . ఎన్.ఎస్ ప్రసాద్, అర్జున్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.