calender_icon.png 20 February, 2026 | 2:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రతలేని బతుకులు!

20-02-2026 12:41:46 AM

  1. భద్రతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలు
  2. మామూళ్ల మత్తులో అధికారులు
  3. ప్రమాదాలెన్నో జరిగినా పట్టించుకోని వైనాలు 
  4. ఇప్పటికైనా తీరు మారాలంటున్న ప్రజలు

చౌటుప్పల్ / సంస్థాన్ నారాయణపూర్, ఫిబ్రవరి 19 :  చౌటుప్పల్ మండలం రసాయన ఫ్యాక్టరీల పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. రాష్ట్రం ఉలిక్కిపడిన సిగాచి ఘటన మరువకముందే చౌటుప్పల్ మండలంలో అనేక ప్రమాదాలు జరిగి ప్రజల కంటిమీద కును కు లేకుండా చేస్తున్నాయి. యాజమాన్యాల అజాగ్రత్త ఒక కారణమైతే.. అధికారుల తీరు ప్రధాన కారణమై వారి నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదికి తీసుకొస్తుంది.             

పట్టించుకునే వారేరి

చౌటుప్పల్ మండల వ్యాప్తంగా వందలాది కంపెనీల నుండి వెలువడే పొగ  వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పసిపిల్లలు, వృద్ధులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకే దిక్కే లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లోని నీరు పూర్తిగా కలుషితమై పంటలు కూడా పండని పరిస్థితి నెలకొంది. రాత్రి సమయాల్లో కంపెనీలనుండి వెలువడే విష వాయువులు పీల్చి జీవచ్ఛవాలుగా మారుతున్న తీరు ప్రజల మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది.                                   

పుట్టగొడుగుల్లా రసాయన ఫ్యాక్టరీలు

చౌటుప్పల్ మండలంలో పుట్టగొడుగుల్లా రసాయన ఫ్యాక్టరీలు వెలిశాయి. వాటి కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్ని వినతిపత్రాలు అందజేసిన తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. కంపెనీ పరిసరాలలో శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపాము ఫలితాలు రాగానే చర్యలు తప్పవు అనే మాట సర్వ సాధారణమైపోయింది.

కానీ ఎలాంటి చర్యలు చేపట్టినా దాఖలాలు లేవు అనేది ప్రజల వాదన. కాలుష్యానికి తోడు కంపెనీలలో సంభవించే అగ్నిప్రమాదాలకు గ్రామాల్లోని ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఎప్పుడూ ఏం జరుగుతుందో.. ఏ కంపెనీ నుండి అగ్ని ప్రమాదం సంభవించి ముప్పు వాటిల్లుతుందో తెలియక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

జరిగిన ఘటనలెన్నో.. 

ఎస్‌ఆర్ ల్యాబ్‌లో ప్రమాదం సంభవించి నెలరోజులు గడవక ముందే కొయ్యలగూ డెం వద్ద బృందావన్ ల్యాబరేటరీ పేలుళ్లతో ఒక్కసారిగా చౌటుప్పల్ ప్రాంతం భయంతో వణికింది. కంపెనీలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి.

భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తప్పవని చెబుతున్న ప్రభుత్వం చేతలు మాత్రం నామమాత్రంగా మిగిలిపోతున్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో నామమాత్రంగా తనిఖీలు చేపట్టి కంపెనీలకు అనుకూలంగా నివేదికలు తయారుచేసి ఇస్తున్నారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి.

 చర్యలు శూన్యం!

ఇటీవల జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనీ స్థానికంగా బలంగా వినిపిస్తుంది. నెలల వ్యవధిలోనే చౌటుప్పల్ పరిధిలోని  శ్రీజయ కంపెనీ, ఎస్ ఆర్ ల్యాబ్స్, బృందావన్ ల్యాబరేటరీలో జరిగిన ప్రమాదాలను, తదుపరి అధికారులు తీసుకున్న చర్యలను పరిశీలిస్తే ప్రజల ప్రాణాలతో చెలగటమడుతున్న కంపెనీలపై అధికారుల చర్యలు శూన్యమని చెప్పేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ముమ్మర తనిఖీలు చేపట్టాలి

మండల వ్యాప్తంగా ఉన్న కంపెనీలలో తరచుగా ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నామమాత్రంగా విచారణ చేపట్టి మామూళ్ల మత్తులో నిర్లక్షం చేస్తున్నారు. దీంతో యాజమాన్యాలు భద్రత ప్రమాణాలు పాటించడం లేదు. ఇప్పటికైనా అధికారులు అన్ని కంపెనీలలో ముమ్మర తనిఖీలు చేపట్టి నిబంధనల మేరకు అన్ని నడుపుతున్నారా లేదా అనేది పరిశీలించాలి. భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలను సీజ్ చేయాలి. అలాగే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.

 ఉప్పు కృష్ణ, యువజన విభాగం నాయకులు, చౌటుప్పల్