26 February, 2026 | 5:57 AM

లే ‘అవుట్’!?

26-02-2026 12:32 AM
  1. ప్లాట్లుగా అసైన్డ్, అగ్రికల్చర్ భూములు 

బై డోర్ నెంబర్లతో రిజిస్ట్రేషన్ 

మున్సిపాలిటీ అయినా.. మారని తీరు

అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు

కేసముద్రం ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ‘లే ఔట్’ లేకుండా వ్యవసాయ భూముల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఇం దులో మరో ట్విస్ట్ ఏమిటంటే పేదలకు సా గు చేసుకోవడానికి ప్రభుత్వం అసైన్ చేసిన భూములు విక్రయించడం. గతంలో పంచాయతీగా ఉన్న సమయంలో దొడ్డి దారిలో డోర్ నెంబర్లు తీసుకుని, వాటికి బై నెంబర్లు వేసి ఖాళీ స్థలాలను అక్రమంగా విక్రయిస్తున్నారు. 5 వేల నుంచి 30 వేల వరకు గజం చొప్పున కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో భూముల విక్రయాలు సాగుతున్నా యి.

అయితే ఎక్కడ కూడా మున్సిపాలిటీ చ ట్టం ప్రకారం ఖాళీ స్థలాలను లేఔట్ చేసి విక్రయించడం లేదు. కనీసం నాలా కన్వర్షన్ కూడా చేయకుండా కొందరు ఇష్టానుసారం గా ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, సబ్ స్టేషన్ తండా గ్రామాలను వి లీనం చేసి కేసముద్రం మున్సిపాలిటీగా ఏ ర్పాటు చేశారు.

అయితే మున్సిపాలిటీగా ఆవిర్భవించినప్పటికీ, పెద్దగా ఎవరు మున్సిపాలిటీ రూల్స్ పాటించడం లేదనే విమర్శ లు వస్తున్నాయి. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఐదు పాత పంచాయతీల ప రిధిలో పలు సర్వే నంబర్లలో అసైన్డ్, అటవీ శాఖ, ప్రభుత్వ భూములు ఉన్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడడంతో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్ కోసం ఆన్ లైన్ లో నిబంధనల ప్రకారం సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఖాళీ స్థలాలను నిబంధనల ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారుల సూచన మేరకు లే ఔట్ చేసి, కొంత స్థలాన్ని గ్రీన్ ల్యాండ్ కింద కేటాయించి, అనుమతులు పొందిన తర్వాత విక్రయించాల్సి ఉంటుంది.

అలా విక్రయించిన ప్లాట్లను కొన్న యజమానులు నిర్మాణం కోసం మళ్లీ ఆన్లైన్ ద్వారా మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకొని అనుమతి పొందిన తర్వాత ఇల్లు, వాణిజ్య స ముదాయాలు ఇతరత్రా నిర్మించుకోవాల్సి ఉంటుంది. అయితే కేసముద్రం మున్సిపాలిటీ ఏర్పడి ఏడాది దాటుతున్నా పెద్దగా ఆ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జ్యోతి బాపూలే ఏలాంటి అనుమతులు లేకుండా ఏకంగా రెండు ఫ్లోర్లు నిర్మించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 

డోర్ నంబర్లతో రిజిస్ట్రేషన్లు

ఖాళీ స్థలాలకు, తమ ఆధీనంలో ఉన్న అ సైన్డ్, ఇతర భూములకు బై డోర్ నంబర్లతో దొడ్డి దారిలో రిజిస్ట్రేషన్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడక ముందు మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను భ విష్యత్తు అవసరాల కోసం గుర్తించి, విక్రయించకుండా అప్పటి కలెక్టర్ గౌతం ఆదేశా లిచ్చారు. ఆ మేరకు కేసముద్రంలో పలుచో ట్ల సర్వే నిర్వహించిన రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి బోర్డులు కూడా నాటారు.

అలాగే కొన్ని సర్వే నంబర్లతో పాటు బై, డోర్ నెంబర్లు వేయకుండా కొన్ని ఇంటి నంబర్లను కూడా బ్లాక్ చేసి రిజిస్ట్రేషన్, గ్రామపంచాయతీ కూడా వాటికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని, సబ్ రిజిస్టార్ కు రిజిస్ట్రేషన్లు చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ గౌతమ్ ఉన్నంతకా లం ఆ భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయన బదిలీపై వెళ్లగానే మళ్లీ పాత పద్ధతికి తెర లేపారు.

దీనితో ప్ర స్తుతం కేసముద్రం పట్టణంలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూముల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములను సైతం లేఅవుట్ చేయకుండా ఇష్టానుసారంగా ప్లాట్లు చేసి గజాల చొప్పున విక్రయిస్తున్నారు. అయినప్పటికీ అటు ము న్సిపాలిటీ, ఇటు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమ ర్శలు వస్తున్నాయి.

ఇలా దొడ్డిదారిలో కొనుగోలు చేసిన ప్రభుత్వ, అసైన్డ్, లేఔట్ లేని భూముల్లో ఇష్టానుసారంగా కొందరు నిర్మాణాలు చేపట్టారని, కేసముద్రం మున్సిపా లిటీ పరిధిలో ఇలా వందల సంఖ్యలో ఎలాంటి అనుమతులు లేని నిర్మాణాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడడంతో భవిష్యత్తు ప్రణాళికతో ప్రభుత్వాన్ని బంధనల ప్రకారం, మున్సిపాలిటీ చట్టం ప్రకారం నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు పర్యవేక్షించాలి. అలాగే ప్రభుత్వ, అసై న్డ్ భూములను పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఖాళీ స్థలాలను విక్రయించే ముందు కచ్చితంగా లేఅవుట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలి.

రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పైప్ లైన్ వేయడానికి అవసరమై న విధంగా అంతర్గత రోడ్లు ఉండేలా చర్యలు చేపట్టాలి. పట్టణంలో ఎక్కడ కూడా అక్రమ నిర్మాణం జరగకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలి. అక్రమ ప్లాట్ల అమ్మకాలు, నిర్మాణాలు చేపట్టకుండా ప్రభుత్వ శాఖల అధి కారులు సమన్వయంతో ముందుకు సాగితే కేసముద్రం మున్సిపాలిటీ ఆదర్శవంతంగా నిలుస్తుంది.

భూమి వివరాలు సరి చూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ప్లాట్లు కొను గోలు చేసే సమయంలో ముందు గా ఆ భూమికి సంబంధించిన స్వభా వం, నాలా కన్వర్షన్, మున్సిపాలిటీ అనుమతి ఉన్న ప్లాట్లను మాత్రమే కొనుగోలు చేయాలి. బై డోర్ నెంబర్లతో రిజిస్ట్రేషన్లు అయ్యే భూముల కొనుగోళ్లను చేసేముందు మున్సిపాలిటీ ద్వారా నిర్మాణానికి అనుమతులు వచ్చే విధం గా ఉన్నాయా లేవా మున్సిపాలిటీ ఆఫీ స్ ద్వారా పరిశీలించుకున్న తర్వాత ప్లాట్లు కొనుగోలు చేస్తే మంచిది. ఇక అక్రమ నిర్మాణాలు, అనుమతులు లే కుండా నిర్మాణాలు, లేఅవుట్ లేకుండా ప్లాట్లు చేసి విక్రయించినట్లు తమ దృ ష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాము. 

శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్