ముస్తాబవుతున్న కామారెడ్డి డిగ్రీ కాలేజీ
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్
ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల( స్వయంప్రతిపత్తి) లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాల సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 60 ఏళ్ల చరిత్ర
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. ప్రభుత్వం నుంచి న్యాక్ ’ఏ’ గ్రేడ్ సాధించిన ఈ కళాశాల, ఇప్పుడు జాతీయ స్థాయి అతిథులకు స్వాగతం పలికేందుకు ముస్తాబవుతోంది.
జాతీయ సెమినార్‌కు హాజరుకానున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద రోడ్డుకు ఇరువైపులా మట్టితో చదును చేసి సుందరీకరణ పనులు చేపట్టారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు పెయింటింగ్ పనులు పూర్తి చేసి స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించారు. జాతీయ సెమినార్ కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో కళాశాల ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ సిబ్బంది ఏర్పాట్లు చురుకుగా చేపడుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, జాతీయస్థాయి విద్యార్థులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ లు ఈ సెమినార్లో పాల్గొననున్నారు.
సెమినార్‌కు డిజిటల్ హాల్ సిద్ధం
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న జాతీయ సెమినార్ కోసం అత్యాధునిక డిజిటల్ సెమినార్ హాల్ను సిద్ధం చేశారు.ఈ సెమినార్కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, జాతీయ,రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ ఆచార్యులు, విశ్లేషకులు విచ్చేస్తున్నారు. సెమినార్లో విద్యా విధానం పై చర్చించనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అవలంబిస్తున్న తీరును సెమినార్లో చర్చించేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు. సెమినార్లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి, కళాశాల విద్య కమిషనర్ శ్రీమతి దేవసేన, ప్రస్తుత రేరా చైర్మన్, పూర్వ కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ, పలువురు పూర్వ విద్యార్థులు, ప్రముఖులు తదితరులు హాజరుకానున్నారు.
దేశాభివృద్ధిలో ఉన్నత విద్య ప్రాధాన్యతపై చర్చ..
నూతన విద్యా విధానం ’లో మార్పులు, దేశాభివృద్ధిలో ఉన్నత విద్య ప్రాధాన్యతపై ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను జాతీయ సెమినార్లో సమర్పించనున్నారు.
సెమినార్ వల్ల కళాశాలకు నాణ్యతా ప్రమాణాలు
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్ నిర్వహణ ద్వారా కళాశాల ర్యాంకింగ్ను, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుందని కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, జాతీయ సెమినార్ చైర్మన్ డాక్టర్ కె. విజయ్ కుమార్ అన్నారు.
- డాక్టర్. విజయ్ కుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
కళాశాలకు కీర్తి లభిస్తుంది
కామారెడ్డి ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో ప్రతిష్టాత్మకమైన జాతీయ సెమినార్ నిర్వహించడం వల్ల విద్యాపరంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కీర్తి మరింత పెరుగుతుంది. విద్యార్థులకు మరింత నాణ్యతమైన విద్య లభించ నుంది.
- కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళాశాల వైస్ ప్రిన్సిపాల్, కిష్టయ్య




