9 July, 2026 | 5:07 PM

సమన్వయంతో ముందుకు సాగుదాం

11-06-2024 12:10 AM

డీఎఫ్‌వో నీరజ్‌కుమార్

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): జిల్లాలోని పెండింగ్ పనులకు అటవీశాఖ అనుమతులు రాబట్టేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని డీఎఫ్‌వో కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 21 ఆర్‌అండ్‌బీ పనులకు అనుమతులు  రా వాల్సి ఉందన్నారు. వీటిలో 11 కాంట్రాక్టర్ల వద్దే పెండింగ్‌లో ఉన్నాయని, ఒక పని మాత్రమే తమపరిధిలో ఉందని స్పష్టం చేశారు.

పంచాయతీరాజ్‌శాఖకు సంబంధించి ఏడు పనులు పెండింగ్‌లో ఉండగా, కాంట్రాక్టర్ వద్ద ఐదు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మరో రెండు పనులు కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చేందుకు అటవీశాఖ సిద్ధంగా ఉందన్నారు. దరఖాస్తులు సక్రమంగా సమర్పిం చాల్సిన బాధ్యత ప్రభుత్వశాఖలపై ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. అభివృద్ధి పనులకు అనుమతులను త్వరితగతిన జారీ చేసే విధంగా చూడాలని డీఎఫ్‌వోను కోరారు. సమావేశంలో అటవీశాఖ రేంజ్ అధికారి అప్పలకొండ, ఆర్‌అండ్‌బీ ఈఈ పెద్దన్న పాల్గొన్నారు.