డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరం కృషి చేద్దాం
- ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్
- మాదకద్రవ్యాల నిర్మూలనపై చైతన్యం అవసరం : ఎస్పీ పరితోష్ పంకజ్
- 2కె రన్‌ను ప్రారంభించిన కలెక్టర్, ఎస్పీ
సంగారెడ్డి, జూన్ 25 : ప్రజాస్వామ్య వ్య వస్థకు ఓటు హక్కు ఎంత ముఖ్యమో, యు వత భవిష్యత్తుకు మాదకద్రవ్యాల రహిత సమాజం అంతే అవసరమని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అ న్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్-2026)పై ఓటర్లలో అవగాహన కల్పించడంతో పాటు మాదకద్రవ్యాలను నిర్మూలించాలన్న సం దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ గెస్ట్ హౌస్ వరకు గురువారం నిర్వహించిన 2కె రన్ను వారు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అని పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి ఓటరుగా నమోదు కావాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు, ఇతర వివరాల నవీకరణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టడంలో పోలీసు శాఖకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు.
మాదకద్రవ్యాల విక్రయం లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. యువత చెడు అలవాట్ల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్కు ‘నో’ చెప్పి ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ 2కె రన్లో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, సాంస్కృతిక సారథి కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






