17 May, 2026 | 11:54 PM

కులగణన పూర్తిచేస్తాం

26-08-2024 05:50 AM
  1. రాష్ట్రంలో కులగణన పూర్తి చేస్తాం 
  2. ‘ఓబీసీ అడ్వొకేట్స్ కన్వెన్షన్’లో మంత్రి పొన్నం

హైదరాబాద్, ఆగస్టు 25(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన పూర్తిచేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. బీసీలు తమ హక్కులను  సాధించుకోవాలని సూచించారు. మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓబీసీ అడ్వకేట్స్ కన్వెన్షన్ కార్యక్రమానికి పొన్నం ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటులో బీసీల పాత్ర మరువలేనిదని, ఈ విషయంలో అందరినీ అభినందిస్తున్నానని అన్నారు.

సమావేశంలో చెప్పిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలహీన వర్గాల న్యాయవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. జీవితం సార్థకం కావాలంటే మనం మన హక్కుల కోసం పోరాడాలని చెప్పారు. మన పోరాటానికి భవిష్యత్‌లో తగిన ఫలాలు అందాలని ఆకాంక్షించారు. బలహీన వర్గాలకు దళిత గిరిజనులకు న్యాయ సహాయం అందించాలని కోరారు.

హైకోర్టుతోపాటు జిల్లా కోర్టుల్లో ఓబీసీ అడ్వకేట్‌లు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీయాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. జ్యోతిబా పూలే, సావిత్రి భాయ్ పూలే, అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కులగణనపై పార్లమెంట్‌లో కచ్చితంగా బిల్లు వస్తుందని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. చట్ట సభల్లో మన ప్రతినిధులుంటే మనకు హక్కుల వస్తాయని చెప్పారు. బలహీన వర్గాలకు ఓబీసీ న్యాయవాదులు అండగా ఉండాలని కోరారు.