‘జలసిరి’ని విజయవంతం చేద్దాం
హైదరాబాద్-, జూలై 27 (విజయక్రాంతి) : దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా నీటి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ముఖ్యంగా తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో ముందుండి పాల్గొని ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు కృషి చేయాలని కోరారు.
వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించవచ్చని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంగా విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళా సంఘాలు గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ నీటి సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట నిర్మించాలనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వర్షపు నీటి సంరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ‘జల సంరక్షణే మన భవిష్యత్తుకు భరోసా. తెలంగాణ జలసిరిని ప్రజలందరం కలిసి విజయవంతం చేద్దాం. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి సస్యశ్యామల తెలంగాణ నిర్మాణానికి మనమంతా భాగస్వాములు కావాలి’ అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.






