హుందాతనాన్ని కాపాడుదాం
* ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ
* తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సమాచారం
* ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలి
* అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
* ప్రొటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు : మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): అసెంబ్లీ హుందాతనాన్ని, ఔన్నత్యా న్ని కాపాడుకునేలా సమావేశాలను నిర్వహించుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆకాంక్షించారు. సమావేశాల్లో ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఆదివారం ఉభయ సభల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని స్పీకర్ చాంబర్‌లో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లా డుతూ.. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశాల్లో కూడా సభ్యులు అడిగిన సమాచా రాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలని ఆదేశించారు. సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో ముద్రిం చాలని సూచించారు. చర్చ జరుగుతున్నప్పుడు సంబంధిత అధికారులు అందుబా టులో ఉంటూ, సభ్యులకు సమాచారం అందించాలని కోరారు.
సభ సజావుగా జరిగేలా సహకరిస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగడానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ప్రొటోకాల్ ఉల్లంఘన ఘటనలపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను పోలీస్ సిబ్బంది గుర్తించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మండలి చైర్మన్, స్పీకర్ పర్యటనల్లో ప్రొటోకాల్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సభలో ప్రస్తావించే ప్రశ్నలకు నిర్ణీత గడువులోగా సమాధానాలు ఇచ్చే విధంగా చూడాలని సీఎస్, ప్రిన్సిపల్ సెక్రటరీలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ వీ నరసింహాచార్యులు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏ అండ్ యూడీ దానకిశోర్, జీఏడీ సెక్రటరీ రఘనంందన్‌రావు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్, ఏడీజీ, లా అండ్ ఆర్డర్ మహేశ్ భగవత్, డీజీ ఫైర్ నాగిరెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు సీవీ అనంద్, సుధీర్‌బాబు, అవినాష్ మహంతి, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.
ప్రొటోకాల్ విషయంలో అప్రమత్తత అవసరం: మండలి చైర్మన్ గుత్తా సమావేశాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి కోరారు. జిల్లాల పర్యటనలో ప్రొటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. వివాదాలు తలెత్తకుండా తగు చర్యలు తీసు కోవాలని ఆదేశించారు. మండలి స మావేశాలు జరిగే సమయంలో అధికారులు తప్పక హాజరుకావాలని చెప్పారు.






