పులుల ఆవాసం అభివృద్ధికి చర్యలు
పీసీసీఎఫ్ డోబ్రియల్
కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): అటవీ అభివృద్ధికి పులుల సంరక్షణ ఎంత ముఖ్యమో మానవాళి రక్షణ కూడా అంతే ముఖ్యమని, అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పీసీసీఎఫ్ డోబ్రియల్ వెల్లడించారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్‌లో వెల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఎలుసింగ్ మెహ్రు, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, సీసీఎఫ్ రామలింగంతో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
జిల్లాలో పులుల సంచారం పెరిగిందని వాటి ఆవాసం, అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన చేపట్టి, ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసినట్లు వివరించారు. మహారాష్ట్రలోని తడో బా, తిప్పేశ్వర్ అడవుల నుంచి పులుల రాక పెరిగిందన్నారు. ప్రస్తుతం పులులు ఆవాసం కోసం వెతుకుతున్నాయని తెలిపారు. కాగజ్‌నగర్ ప్రాంతంలో ఎక్కవగా ప్రభావం ఉంద న్నారు.
ఈ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో పులి ఆవాస కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఎకో టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గడ్డి భూముల అభివృద్ధి, ప్లాంటెషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అటవీ సిబ్బందికి ఆయుధాల ఏర్పాటు కోసం ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పులుల సంచారంపై వదంతులు ప్రచారం చేయవద్దని కోరారు. పులుల సంరక్షణపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వారివెంట ఎఫ్‌డీవోలు, ఎఫ్‌ఆర్వోలు ఉన్నారు.






