ప్రభుత్వ బడులు కాపాడుకుందాం!
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభు త్వ పాఠశాలలో డిజిటల్ విద్యను, ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చెయ్యాలి. పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి.
తెలంగాణ రాష్ర్టంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిం ది అనడానికి ప్రభుత్వం ఇటీవల విద్యా రంగంలో తీసుకొచ్చిన మార్పులు, నిర్ణయాలే నిదర్శణం. కేంద్ర ప్రభుత్వం విడు దల చేసే పెర్పార్మేన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ)లో రాష్ర్టం ర్యాంక్ పడిపోకుండా ఉండటం కోసం.. 1,441 బడులను జీరో ఎన్ రోల్‌మెంట్ కారణంగా మూసివెయ్యాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం దయనీయ స్థితికి అద్దం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం జులై నెలలో విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో విద్యార్థులు లేని పాఠశాల జాబితాలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ రెం డో స్థానంలో ఉండేది.
తాజాగా కేంద్రం ప్రకటించిన నివేదికలో జీరో ఎన్‌రోల్ మెంట్ ఉన్న జాబితాలో తెలంగాణ రా ష్ర్టం మొదటి స్థానానికి చేరుకోవడం శోచనీయం. దీంతో రాష్ర్ట పెర్పార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) ర్యాంక్ ఏటా పడిపోతూ వస్తుంది. దీనివల్ల ప్రభుత్వం 1,441 పాఠశాలలను మూసి వేసి 2026 యూ డైస్ లెక్కల నుంచి తొలిగించాలని నిర్ణ యం తీసుకోవడం జరిగింది.
మరో 640 పాఠశాలలో కేవలం ఉపాధ్యాయులు మా త్రమే ఉండి, ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో అందులో పని చేస్తున్న ఉపాధ్యా యులను వేరే పాఠశాలలకు డిప్యుటేషన్ పై పంపించి వాటిని కూడా త్వరలో మూ సే ప్రక్రియను మొదలుపెట్టాలని ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విద్య పట్ల పాలక వర్గాలకు ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.
కనుమరుగు దశలో..
తెలంగాణ రాష్ర్టంలో 26 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2024 విద్యా సంవత్సరంలో రాష్ర్టంలో 2,081 జీరో ఎన్ రోల్ మెంట్ పాఠశాలలు ఉన్నట్టు తేలగా, ప్రస్తుతానికి 1,441 స్కూళ్లను మూసి వేయ్యడంతో పాటు, మిగిలిన 640 పాఠశాలలను మూసివేస్తే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 24 వేలలోపే పరిమితం కానుంది. ఇవే కాకుండా సంవత్సరం క్రితం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో విద్యా రంగంపైన జరిగిన చర్చలో 3,144 అప్పర్ ప్రైమరీ పాఠశాలల విలీనంపైన నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
అంటే భవిష్యత్తులో అప్పర్ ప్రైమరీ పాఠశాలలు కూడా ముసివేసే ప్రమాదముంది. ఇటు 2వేల జీరో ఎన్‌రోల్ మెంట్ బడు లు, అటు అప్పర్ ప్రైమరీ పాఠశాలు మొ త్తంగా కలిపి ఐదు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు శాశ్వతంగా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితికి తోడు ఇటీవల విడుదల చేసిన తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ -2047లోను ఓకే ప్రాంగణంలోని ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను విలీనం చెయ్యాలని ప్రకటించారు. దీనితో మరికొన్ని పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి.
వైఫల్యాలు అధిగమించాలి..
ఏకీకృత పాఠశాల వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. పాఠశాల బోధనా సిబ్బంది పంపకంలో కూడా శాస్త్రీయత లేదు. ప్రభు త్వ బడుల్లో బోధనా సిబ్బంది ఉన్నా విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. అదే, ఇరుకు భవనాల్లోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కిక్కిరిసిన విద్యార్థులు ఉన్నా సామర్థ్యం కలిగిన బోధనా సిబ్బంది లేరు. ఇక రెసిడెన్షియల్ పాఠశాలలు తాత్కాలిక ఉపాధ్యాయులతో, అద్దె భవనా ల్లో నడుస్తున్నాయి. కొత్తగా వచ్చిన విద్యాహక్కు చట్టంతో పాటు, నూతన విద్యా విధానంలోని అంశాలు ఎంత వరకు పాఠశాలల్లో నెరవేరుతున్నాయనేది ప్రశ్నార్థకం.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వ పాఠశాల వైఫల్యం గురించి వివరిస్తూ.. రాష్ట్రంలోని సుమారు 13వేల ప్రాథమిక పాఠశాలల్లో 50మంది కంటే తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని తెలిపింది. ఇక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు పాఠశాల ఏర్పాటు స్థలం, అభివృద్ధి గురిం చి ప్రజలు ఆలోచించేవారు.
కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యాసంస్థలు పట్టణాల్లో విచ్చలవిడిగా వెలసి విద్యా వ్యాపారం చేస్తున్నా యి. ఇంత దారుణమైన పరిస్థితిలో ప్రభు త్వ బడిని బతికించడం, ప్రైవేటు పాఠశాల నియంత్రణ ప్రస్తుత ప్రభుత్వం ముందున్న అత్యవసర కర్తవ్యాలు. ప్రభుత్వ పాఠశాలల పునరేకీకరణ, సిబ్బంది సర్దుబాటు తదితర విషయాల్లో ప్రభుత్వం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ప్రభుత్వాలు అవేమీ చేయకుండా కేవలం పైపై లేపనాలతోనే సరిపెడుతున్నాయి. తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను పటిష్ఠంగా అమలు చేయడం ప్రభుత్వం ముందున్న బాధ్యత.
పునరుద్ధరణ..
ఈ నివేదికలోని అంశాలు అమలు కావాలంటే నిధుల కేటాయింపు, ప్రణాళికేతర వ్యయంతో తప్ప మరో గత్యంతరం లేదు. ప్రభుత్వ బడుల భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలి. రాష్ట్రంలోని 9,517 అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేసి, పూర్వ ప్రాథమిక విద్యపై దృష్టి సారించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని రుచి తో, శుచితో విద్యార్థులకు అందజేయాలి. ఇలాంటి అనేక విధానాలను అమలుచేసినప్పుడే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సం ఖ్య క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది.
గ్రామాల్లో పాఠశాలలు మూతపడటం వల్ల పేద, దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్ర మాదం ఉంది. దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లాలంటే రవాణా ఖర్చులు భరించ లేని తల్లిదండ్రులు పిల్లలను బడి మాన్పిం చే అవకాశం ఉంది. కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి చదువుకోవడం చిన్న పిల్లలకు భారంగా మారుతుంది. ముఖ్యంగా ఆడపిల్లల విద్యపైన తీవ్ర ప్రభావం పడుతుంది.
ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రం లో డ్రాపౌట్స్ (చదువును మధ్యలో మానేసేవారి) సంఖ్యను పెంచుతుంది. ఇది బాలకార్మిక వ్యవస్థకు లేదా బాల్య వివాహలకు దారితీయవచ్చు. ప్రభుత్వ పాఠశాలలను మూసి వెయ్యడం కంటే వాటిని పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి.
బలోపేతం అవసరం..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను, ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేయ్యాలి. పాఠశాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. తాగు నీరు, టాయిలెట్స్ సౌకర్యాలు లేని పాఠశాలలు రాష్ర్టంలో చాలా ఉన్నాయి. గ్రామాల్లోని సర్పంచులను, విద్యా కమిటీలలో భాగస్వామ్యం చేసి అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలి. ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేసి పాఠశాలల్లో బోధనా పద్ద తులపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేయాల్సిన అవసరముంది.
దీనితో తల్లిదండ్రు లకు ప్రభుత్వ పాఠశాలల పైన నమ్మకం కలిగి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించే అవకాశాలు మెరుగవుతాయి. అయితే పాఠశాలల ముసివేత తాత్కాలికమే.. విద్యార్థులు వస్తే మళ్ళీ తెరుస్తాం అన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణలో సాధ్యం అవుతుందా అన్నది పరిశీలించాలి. ప్రభు త్వం ర్యాంకింగ్ కోసం పాఠశాలలను మూ సివేసి దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చెయ్యకూడదు.
పాఠశాలలను మూసివేయడం సమస్యకు ముగింపు కాదు. అది ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చెయ్యడంలో ప్రభుత్వ వైపల్యానికి అంగీకారం మాత్రమే అవుతుంది. పాఠశాలల మూసివేతను విద్యావేత్తలు, యువజ న, విద్యార్ధి, ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేకించాల్సిన అవసరముంది. లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది.






