సెల్‌ఫోన్‌కు బందీ!
నేటి తరంలో పొద్దున లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు ఏ ఇంట్లో చూసినా పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్‌లోనే మునిగి తేలుతున్నారు. ఫోన్లకు బానిసలుగా మారి చిన్నచిన్న విషయాలకే కోపగించుకోవడం, చిరాకు పడడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా 6 నుంచి -12 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లల్లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తున్నది. ఇటీవలే ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ ’ అనే సంస్థ పిల్లలపై చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
మూడు నుంచి 12 ఏళ్ల వయసున్న పిల్లల్లో 80 శాతం యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారని, 53 శాతం పిల్లలు ఫోన్లను అతిగా, కేవలం 4 శాతం పిల్లలు మాత్రమే అతి తక్కువగా వినియోగిస్తున్నారని తెలిపింది. మొబైల్ ఫోన్ వాడకం వల్ల 46 శాతం మంది పిల్లలు సృజనాత్మకత, ఆలోచనా శక్తిని కోల్పోతుండడం గమనార్హం. పాఠశాలకు వెళ్లినంత సేపు మాత్రమే ఫోన్లకు దూరంగా ఉంటున్న పిల్లలు ఇంటికి వచ్చాకా షరా మాములుగా ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నా రు. దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.
స్మార్ట్‌ఫోన్లు వీక్షించడం వల్ల కంటి సమస్యలు, రెటీనా, నరాలు దెబ్బతినడం, నిద్రలేమి, శారీరక బలహీనతతో పాటు ఉబకాయం లాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్, బ్లూస్క్రీన్ అతిగా ఎక్స్‌పోజ్ కావడం వల్ల పిల్లల మెదడు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇది వారి ఆలోచనా శక్తిని, వినికిడి శక్తిని తగ్గిస్తుంది. పిల్లలు తరచూ ఫోన్ చూడడం వల్ల ‘నోమోఫోబియా’ అనే మానసిక వ్యాధికి గురయ్యే ప్రమాదముందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
ఈ వ్యాధి వల్ల కోపం, ఆనందం వంటి భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేక పిల్లలు ఒంటరితనానికి అలవాటుపడుతున్నారని తెలిపింది. అయి తే కేవలం పిల్లలనే నిందించడం సరికాదు. తల్లిదండ్రుల పెంపకం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది.
నేటి బిజీలైఫ్‌లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడం, అల్లరి ఆపాలని, ఇతరత్రా పనులకు ఆటంకం కలగకూడదని తల్లిదండ్రులే ఫోన్లను ఇవ్వడం చేస్తున్నారు. ఇది తాత్కాలిక ఉపశమనమైనప్పటికీ స్మార్ట్‌ఫోన్ల అతివినియోగం పిల్లల్లో తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తుందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే నివారణ మార్గాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి.
ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఎక్కువసేపు ఇవ్వడం ఆపేయాలి. ఇంట్లో ఉన్నంతసేపు పిల్లలతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. స్మార్ట్‌ఫోన్లను దూరం చేసేందుకు పిల్లలకు పజిల్స్, గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాల్సిన అవసరముంది. ప్రభుత్వాలు కూడా పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ సెషన్‌లు ఏర్పాటు చేయాలి.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పిల్లలను మొబైల్ స్క్రీన్‌స్పేస్ నుంచి దూరం చేయడానికి వినూత్న ఆలోచన చేసింది. రాష్ట్రంలో సెకండరీ, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఇకపై తప్పనిసరి వార్తా పత్రికలు చదివేలా చూడాలని పేర్కొంది. విద్యార్థుల్లో పఠనా సక్తిని పెంచేందుకు, డిజిటల్ స్క్రీన్ సమయాన్ని తగ్గించాలనే లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇలాంటి చర్యలతో పిల్లలను కొంతైనా మొబైల్‌కు దూరం చేసేందుకు అవకాశముంటుంది.






