15 April, 2026 | 7:16 AM

పుటుక్కు జరజర డుబుక్కుమే!

26-12-2025 12:00 AM

మొదటి తరం నాయకులు ప్రజాసేవ, నైతిక విలువల ప్రాతిపదికన పని చేశారు. అంతేకాదు అప్పటి నాయకులు తమ పరిధిలోకి వచ్చే ప్రతీ గ్రామంలో కలియతిరిగి ప్రజలతో మమేకమయ్యేవారు. 

రాజు వెడలె సభకు అన్నట్టు కేసీఆర్ రెండేళ్ల ఫామ్ హౌస్ విశ్రాంత ఆశ్రమం నుంచి ఇటీవల నగర ప్రవేశం చేశారు. తమ పార్టీ భవనంలో కార్యకర్తలతో కొన్ని లైఫ్‌లైన్ మాటలు మా ట్లాడారు. అధికార పార్టీకి తాను రెండేళ్లు గ్రేస్ పీరియడ్ ఇచ్చానని.. ఇక తోలు తీస్తానంటూ ఆయన మార్కు రాజకీయంతో పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అధికార పార్టీ మీద ఒంటి కాలు మీద షరా మాములుగానే రెచ్చిపోయారు.

తెలంగాణ ప్రస్తుత పరిస్థితికి కారణం ఏ ఒక్క పార్టీ నాయకులైనా, అధినాయకులైనా.. బరు వూ మోయరు, బాధ్యత వహించరు. పైగా ఈ దుస్థితికి మీరే కారణమంటే మీరే కారణమంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసు కోవడం షరామామూలే. తాటి చెట్టు ఎం దుకు ఎక్కినవ్ అంటే దుడ్డె గడ్డి కోసం అన్నట్టు అధికార పార్టీ నాయకులు ఒకవైపు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు మరో వైపు పరస్పరం దూషణలకు దిగారు. అం దరూ అమూల్ బేబీలే కానీ వండిన అన్నం డేకీసా మాత్రం ఖాళీ అయిపోతుంది. 

కాళ్లు ఊపుకుంటూ..

ఇది మన రాష్ర్టంలోనే కాదు. అటు కేంద్రంలోనూ, అన్ని రాష్ర్ట ప్రభుత్వాల్లోనూ ఇంచుమించుగా ఇలాంటి ఆరోపణలే ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుం టూ మీడియా మాధ్యమంగా టన్నులకొద్దీ వినోదాన్ని వీక్షకులకు, శ్రోతలకు పంచుతుంటారు. వారు, వీరు అనే భేదం లేకుండా అందరూ నీళ్ల మీద దెబ్బ కొట్టినట్టు తమ వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తుం టారు.

కేవలం ప్రేమ్ మాత్రమే పెట్టిన గాంధీ విగ్రహం కళ్లద్దాలోంచి ఇంటింటికి చెత్త బండిని పంపి అభివృద్ధి పేరున స్వచ్ఛభారత్ అని కలలు కంటుంటారు. అంద రూ వెంట్రుకలకు బఠానీలు అమ్మేవాళ్లే. సత్య నారాయణస్వామి కథలు చెప్పినప్పుడు కదలకుండా వినేలాగా కథలు డిజైన్ చేసినట్టు ‘అదిగో వృద్ధి .. ఇదిగో అభివృద్ధి జరిగే’ అంటూ ఐదేళ్ల పాటు ఓటర్ల ఓపికకు పరీక్ష పెట్టి వారిని విసిగిపోయేలా చేయడం అలవాటుగా మార్చుకు న్నారు. అదే సమయంలో ఈ నాయకులే తమ కాళ్లను ఊపుకుంటూ అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతుంటారు. 

మనసంతా పుండుగా..

78 ఏళ్ల స్వతంత్ర భారతంలో అధికారంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజ లను నిర్దాక్షిణ్యంగా పెన్షన్ల కోసం, రేషన్‌ల కోసం రైతులను, వృద్ధులను, మహిళలను, విద్యార్థులను వివిధ చోట్లకు తరిమే స్తున్నారు. అయ్యగారికి సంభావన ప్రజలకు తీర్థప్రసాదాలు అన్నట్లుగా. ప్రజా స్వామ్యం అంతా కొడితే ఇంతే సంగతులు. దేశభక్తి, ప్రజాసేవ, నిస్వార్థ నాయకత్వం స్థానంలోకి ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థ దందాగా చేరిందో అప్పటి నుంచి ‘నీకు ఇది.. నాకు అది’ అని ‘క్విడ్ క్రో ప్రోకో’ అన్నట్లుగా ఆక్రమించి దేశ ప్రజలను ఆగం పట్టిస్తున్నారు.

ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజకీయ నాయకులు, అధికారం రాగానే వాళ్లు ఇచ్చిన హామీలు, నినాదాలను నెరవేర్చలేక శూన్య హస్తాలుగా మారిపోతున్నారు. ఏ ఒక్కరూ ఓటర్లకు జవాబుదారితనం వహించరు. తెల్లారి లేస్తే సంక్షేమం పేరున నాయకులు ఊదరగొడుతూ ఉంటారు. అప్పులు అంటే అభివృద్ధి అని వేమన, సుమతీ శతక నీతి సూక్తులు బోధిస్తుంటారు.

రాజకీయాల్లో ఇంకా ‘ఆవు లాంటి హరికథలు ప్రజలకు చెప్పడం అలవాటైపోయింది. రోజురోజుకు రాజకీయాల తీరు చూస్తుంటే ‘తోక పోయి కత్తి వచ్చే డాం డాం’ అన్న నీతి కథ మదిలోకి వస్తుంది. ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. ‘అంతా వడ్లు పెరుగు కలిపిన ట్టుగా’ అనే సామెత లాగా మనసంతా పుండు పుండుగా ఉంటుంది.

తలకాయ రెండు వక్కలై..

మొదటి తరం నాయకులు ప్రజాసేవ, నైతిక విలువల ప్రాతిపదికన పని చేశారు. అంతేకాదు అప్పటి నాయకులు తమ పరిధిలోకి వచ్చే ప్రతీ గ్రామంలో కలియతిరిగి ప్రజలతో మమేకమయ్యేవారు. కుటుం బం కన్నా ప్రజలను ఎక్కువగా ప్రేమించేవారు. లంచాలు అనే మాట వారి దరి చేరే ది కాదు. బస్సులో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుని ఎంత దూరమైనా ప్ర యాణాలు చేసేవారు. మంచి చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కాస్తా భూమి జాగలను అమ్ముకొని చివరి రోజుల్లో కష్టంగా బతికేవారు. ఎన్నికలప్పుడు హద్దు మీరి మాయ మాటలు చెప్పి గద్దె మీద కూర్చున్న ఓ గడుసు రాజా!..

కమిషన్ రిపోర్ట్ లో తేల్చి న విద్యుత్తు కొనుగోళ్ల అవినీతిపైన ఇప్పటివరకూ ఎందుకు చర్యలు చేపట్టలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో నుంచి కాంట్రాక్టర్లను ఎందుకు మినహాయించారు? ప్రతి ఏటా దావోస్ అంగట్లకు పో యి ఖర్చు పెట్టింది ఎంత మీరు? సద్దులు కట్టుకొచ్చిన దాంట్లో పాసిపోయినవి ఎన్ని? అవిసిపోయినవి ఎన్ని? రద్దయినవి ఎన్ని? రాశికి వచ్చినవి ఎన్ని????.. తెలిసి చెప్పకపోతే మాత్రం తలకాయ రెండు వక్కలై చనిపోతావు. తెలియక చెప్పకపోతే భుజం మీద మోస్తున్న బేతాళ శవం చెట్టు ఎక్కుతుంది. 

హరికథలు ఆపండి!

పోసిన కుప్ప మీద కూసొని గట్టి గింజలను కావలసినంత బుక్కి, దోచుకొని.. దాచుకొని పంజరంలో నుంచి అప్పుడప్పుడు అతిథి నటునిలా వచ్చిపోయే ఓ విపక్ష పలుకుల చిలకల్లారా! బేతాళ విక్రమార్క కథలను ఎన్ని రోజులు హరికథగా చెప్పుకుంటూ వస్తారు. చెప్పేవానికి లేకు న్నా వినేవాడు ఉన్నంతసేపు ‘నక్క కాక మ్మ కథలు’, ‘బొంకు నేర్చినమ్మ రంకు నేర్చినట్టు’ చెప్తూనే ఉంటారు. అయ్యలారా అందరూ శాకాహారులే అయిన ప్పుడు తెలంగాణ దేశీ కోడి ఎట్లా మాయమైపోయింది? ఎవరు మాయ చేసి కాజే శారు. తెల్లారి లేస్తే లక్ష్మీకళ తాండవించే మీకూ మీ నోళ్ల కు మొక్కాల్సిందే.

మీరు ఎన్ని బహురూపుల వేషాలు కట్టండి.. తిమ్మిని బమ్మి చేసే మాటలు చెప్పండి. 2001లో టీఆర్‌ఎస్ నాయకుల ఆస్తు లు ఎన్ని ఉన్నాయి.. 2025 వచ్చేసరికి అదే బీఆర్‌ఎస్ నాయకుల ఆస్తులు ఎంత పెరిగాయో చెప్పండి సార్లూ ! ప్రజలకు మం చి చేసే నాలుగు మంచి మాటలను చెప్తే బాగుపడతారని గ్రహించండి. కానీ ఆ విషయాల మీరు ఎన్నడూ దృష్టి పెట్టరు.

ఓటర్లకు పందేలు ఎన్ని పడ్డా అదేందో కానీ పచ్చీసులో ఎప్పటికీ గడ నొక్కదు. పందెం పడ్డా పడకున్నా మీరు మాత్రం ఇంట్ల సీదా పడుతరు. మి మ్మల్ని నాయకునిగా ఎన్నిక చేసుకున్న పాపానికి ఐదేళ్ల కోసారి మేము ఓడిపోవడం.. మీరు మళ్లీ మళ్లీ గెలువడం. దీనినే అంటారు ‘పుటుక్కు జరజర డుబుక్కుమే!’