నేడు పరేడ్ గ్రౌండ్‌లో ‘విమోచన’ వేడుకలు
- ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ఉపరాష్ట్రపతి
- పాల్గొననున్న కేంద్రమంత్రులు, గవర్నర్, ప్రజాప్రతినిధులు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిజాం పాలన(Nizam Rule) నుంచి హైదరాబాద్ సంస్థానం(Hyderabad State) విముక్తి కోసం జరిగిన పోరాటం భారత స్వాతంత్య్ర పోరాట(Indian Freedom Struggle) చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ, సర్దార్ వల్లభాయ్ పటేల్(Sardar Vallabhbhai Patel) చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’(Operation Polo) (ప్రత్యక్ష పోలీసు చర్య) ద్వారా ఇక్కడి సంస్థాన ప్రజలకు మరో 13 నెలల తర్వాత విముక్తి లభించింది.
ఈ చారిత్రక దినోత్సవానికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ‘తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana Liberation Day)’గా జరుపు కోవాలని మార్చి 12, 2024న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా, ఈ విముక్తి చరిత్రను భద్రపరచడానికి సంస్కృతి మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ‘liber ationhyderabad.org’ వర్చువల్ మ్యూ జియాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే నేడు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విశిష్ట అతిథులుగా, కేంద్ర మం త్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరుకానున్నారు. ఈ వేడకులను కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ స్థాయిలో ఏర్పాట్లను చేసింది.ప్రజాప్రతినిధులు, ప్రజలు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు ఇప్పటికే ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను చేపట్టింది.